తప్పుడు సర్టిఫికెట్లతో కాలేజీ అనుమతులు

తప్పుడు సర్టిఫికెట్లతో కాలేజీ అనుమతులు
  •     ఖమ్మం శ్రీకవితా ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాకం 
  •     విజెలెన్స్ రిపోర్టులో బహిర్గతం 
  •     ఎంక్వైరీ రిపోర్టు కాలేజీకి అనుకూలంగా ఇచ్చిన కేయూ ప్రొఫెసర్లపై చర్యలు

హైదరాబాద్,వెలుగు : రాష్ట్ర ప్రభుత్వానికి, ఏఐసీటీఈకి తప్పుడు పత్రాలు పెట్టి అనుమతులు పొందిన ఖమ్మం జిల్లాలోని కవితా ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాకం బయటపడింది. రెండేండ్ల పాటు కాలేజీ నిర్వహించి, రూ.24.40 లక్షలు దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది.  దీనికి మద్దతుగా నిలిచిన ముగ్గురు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లతో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ జేడీపై విజిలెన్స్ సిఫారసులతో చర్యలకు సర్కారు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలోని తనికెళ్ల గ్రామంలో శ్రీ కవిత ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలో ఎంబీఏ కాలేజీని నిర్వహించారు.

2018లోనే  వేరే వారికి ఆ స్థలంతో పాటు భవనాన్ని అమ్మేశారు. అయినా, అక్కడే కొనసాగుతున్నట్టు ఆ సొసైటీ ప్రతినిధులు ఏఐసీటీఈ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​, కాకతీయ యూనివర్సిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి, వేరే చోట కాలేజీ కొనసాగించారు. ఈ క్రమంలో 2019–20తో పాటు ఆ తర్వాతి రెండేండ్లు అఫిలియేషన్లు పొందారు. దీనిపై ఆ సొసైటీ మాజీ సభ్యులు.. హనుమంతరావు ఇల్లీగల్ గా కాలేజీ నడిపిస్తున్నట్టు ఏఐసీటీఈ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్టాండింగ్ అప్పిలేట్ కమిటీ (సాక్) తనిఖీ చేసి, ఆ కాలేజీపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.

కాకతీయూ వర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లు ఎస్.కమలేశ్వర్, రాజేశం, సక్రియ తదితరులు  కాలేజీని, భవనాలను తనిఖీ చేయకుండానే రిపోర్టు ఇచ్చి, గుర్తింపు కోసం సిఫారసు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో మరోసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ జేడీ పుల్లయ్యతో విచారణ చేయించగా, ఆయన కూడా కాలేజీకి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయగా, తప్పుడు పత్రాలతో కాలేజీ అనుమతులు పొందినట్టు నిర్ధారించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలనూ తప్పుదారి పట్టించి రూ.24.40 లక్షలు పొందినట్టు విచారణలో తేలింది. తప్పుడు పత్రాలతో సర్కారును మోసం చేసిన కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ ఉషాకిరణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, రూ.24 లక్షలనూ రికవరీ చేయాలని సర్కారుకు సిఫారసు చేసింది. దీంతో ప్రొఫెసర్లతో పాటు జేడీ పుల్లయ్యపై చర్యలు తీసుకోవాలని సూచించింది. 

జేడీ పుల్లయ్యకు మెమో 

ఎంక్వైరీ ఆఫీసర్​గా ఉండి, తప్పుడు నివేదికలిచ్చిన టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ఏ.పుల్లయ్యకు విద్యాశాఖ సెక్రటరీ వెంకటేశం బుధవారం మెమో జారీచేశారు. విజిలెన్స్ రిపోర్టుపై పది రోజుల్లో రిప్లై ఇవ్వాలన్నారు. మరోపక్క కాకతీయ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఎస్.కమలేశ్వర్ రావు, సీహెచ్ రాజేశం, సక్రియ (ప్రస్తుతం ముగ్గురు రిటైర్డ్)పై ఈసీలో పెట్టి చర్యలు తీసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌ను ఆదేశించారు.