
దరాబాద్: తన మెడలో ఉన్న బంగారు గొలుసును ఆగంతకుడు తెంచుకుని వెళ్లాడంటూ ఓ మహిళ పోలీసులను మూడు గంటలపాటు హైరానాకు గురిచేసింది. ఆమె చెప్పిన చోట సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆమె ఫిర్యాదు తప్పని తేల్చి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు . నారాయణగూడ సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌కు చెందిన మహిళ హైదర్‌గూడలోని ఓ జువెల్లరీ షాప్ లో ఉద్యోగం చేస్తోంది.
సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఎవరో ఆగంతకుడు బైక్ పై వచ్చి తన మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలసును తెంచుకుని వెళ్లాడు అని పోలీసులకు ఫిర్యాదు చేసింది . వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హైదరగూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా నుండి హిమాయత్ నగర్ వెళ్లే దారిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. ఒక చోట ఈ మహిళనే తనంత తానుగా బైకై పై వచ్చిన వ్యక్తికి తన మెడలో ఉన్న చైన్ ఇచ్చింది. అతనితో కొద్ది క్షణాలు మాట్లాడినట్లు కనిపించింది.
వెంటనే మహిళకు సీసీ కెమెరా ఫుటేజీ చూపించి నిలదీయగా ఆమె నీళ్లు నమిలింది. తేలుకుట్టిన దొంగలా మారి మౌనం వహించింది. అసలు విషయం చెప్పకపోతే తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కఠినమైన శిక్షలు పడేలా కేసు పెడతామనే సరికి కాళ్లబేరానికి దిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బుల కోసం తన చైన్ ను అతనికి తాకట్టు పెట్టానని, తానే అతన్ని పిలిపించి గొలుసు ఇచ్చినట్లు చెప్పింది. ఈ విషయం దాచిపెట్టేందుకు చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇక ముందు అలా చేయవద్దని , రిపీట్ చేస్తే కేసు నమోదుచేసి అరెస్టుచేస్తామని మహిళను హెచ్చరించిన పోలీసులు ఆమెను ఇంటికి పంపించివేసారు . ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని సీఐ తెలిపారు.