కలియుగ వైకుంఠం తిరుమలలో మరోసారి నకిలీ టికెట్ల కలకలం రేగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ లెటర్లు చలామణి కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో విజయవాడ పోలీసులను ఆశ్రయించారు మంత్రి పీఏ. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల పలువురు భక్తులు దళారుల నుంచి మంత్రి సత్యకుమార్ పేరుతో ఉన్న టీటీడీ లెటర్లు కొన్నారు. అనంతరం తిరుమల దర్శనానికి వెళ్లగా.. ఆ లెటర్లు నకిలీవి అని టీటీడీ అధికారులు తెలిపారు.
నకిలీ లెటర్లు కొని మోసపోయామని గ్రహించిన బాధితులు మంత్రి సత్యకుమార్ దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లారు. గత కొద్దిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు జారీ అవుతున్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో విజయవాడ సిటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మంత్రి పీఏ. తన పేరుతో నకిలీ లెటర్ల జారీపై దర్యాప్తు చేపట్టాలని కమిషనర్ ను ఆదేశించారు మంత్రి సత్యకుమార్. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తిరుమలలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ టీటీడీ టికెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా.. మరోసారి నకిలీ టికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే టార్గెట్ గా నకిలీ లెటర్లు అమ్ముతున్నారు దళారులు. ఈ దందాలో భారీగా నగదు దోచుకుంటున్నారు దళారులు. నకిలీ టికెట్లతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు.
