
- వేణు మెడికల్ ఏజెన్సీపై రెండుసార్లు డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ల దాడి
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో నకిలీ మందు లు, నిషేధిత మెడికేటెడ్ సోప్ ల మాఫియా దందా జోరుగా నడుస్తోంది. పేరొందిన కంపెనీల పేరుతో డూప్లికేట్ డ్రగ్స్ ను కొన్ని మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు సప్లై చేస్తున్నారు. కొన్నేళ్లుగా కరీంనగర్ లో సాగుతోన్న దందాపై ప్రముఖ సన్ ఫార్మా కంపెనీ ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. నకిలీ మందులు సప్లై చేస్తున్నారనే అనుమానంతో గత ఏప్రిల్ 9న తొలిసారి వేణు మెడికల్ ఏజెన్సీపై డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దాడి చేసి కొన్ని డ్రగ్స్ సీజ్ చేసి తీసుకెళ్లారు. మరోసారి శనివారం దాడి చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
సన్ ఫార్మా కంపెనీ పేరుతో నకిలీ డ్రగ్స్
అసోంలోని సన్ ఫార్మా కంపెనీ యూనిట్ లో పెరాలసిస్ పేషెంట్లకు వాడే లివిపిల్-– 500 డ్రగ్స్ ను తయారు చేస్తుండగా.. కరీంనగర్ కు చెందిన వేణు మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు డీలర్ షిప్ పొందారు. కొన్నాళ్లుగా ఏజెన్సీ నుంచి ఆర్డర్స్ లేకపోవడంతో కంపెనీ మార్కెటింగ్ ఉద్యోగులు అనుమానించి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కంపెనీ ప్రతినిధులు ఏజెన్సీలో విచారించగా, తమ డ్రగ్స్ కాదని తేలింది. దీంతో స్టేట్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయగా.. వేణు మెడికల్ ఏజెన్సీపై దాడి చేశారు.
నిర్వాహకులను ప్రశ్నిస్తే.. హైదరాబాద్ లోని రామ్ ఫార్మా నుంచి డ్రగ్స్ కొన్నట్టు ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. రామ్ ఫార్మాపైనా దాడి చేయగా కోల్ కతా నుంచి తెచ్చినట్టు తేలింది. దీంతో డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు కోల్ కతా వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కాగా.. వేణు ఏజెన్సీది తప్పేంలేదని క్లీన్ చిట్ ఇచ్చేందుకు డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్ ఇన్ స్పెక్టర్లు మామూళ్లు వసూలు చేసుకుంటూ నకిలీ మెడిసిన్ పై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.