లక్సెట్టిపేట కేంద్రంగా ఫేక్‌‌‌‌ కరెన్సీ దందా..కొన్ని రోజులుగా రూ.500 నోట్లు చలామణి

లక్సెట్టిపేట కేంద్రంగా ఫేక్‌‌‌‌ కరెన్సీ దందా..కొన్ని రోజులుగా రూ.500 నోట్లు చలామణి

లక్సెట్టిపేట, వెలుగు : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కేంద్రంగా నకిలీ నోట్లు చలామణి అవుతుండడం కలకలం సృష్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా నకిలీ నోట్ల వ్యవహారం ఎక్కడ బయటపడినా.. లక్సెట్టిపేటకు చెందిన వారి పేర్లు బయటకు వస్తుండడంతో అటు వ్యాపారులు, ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో నకిలీ నోట్ల చలామణి వ్యవహారం పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. తాజాగా.. పట్టణంలో మరోసారి నకిలీ నోట్ల చలామణి వెలుగు చూసింది. రద్దీగా ఉండే షాపుల్లోనే ఈ నోట్ల చలామణి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పట్టణంలోని రెండు వైన్స్‌‌‌‌లో పలుమార్లు దొంగ నోట్లు వచ్చినట్లు తెలిసింది.

ఒక్కరోజే ఒకే వైన్స్‌‌‌‌లో మూడు రూ.500 నోట్లు రావడంతో ఓనర్లు కంగుతిన్నారు. ఇటీవల ఓ సూపర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లోనూ నకిలీ రూ.500 నోటు వచ్చింది. అకౌంట్స్‌‌‌‌ చూస్తున్న టైంలో గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సూపర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లోని సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేస్తున్నారు. నకిలీ నోట్ల వ్యవహారంలో మండలంలోని రెండు గ్రామాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.