నకిలీ ష్యూరిటీలతో.. కోర్టునే బురిడీ కొట్టించిన గంజాయి స్మగ్లర్లు

నకిలీ ష్యూరిటీలతో.. కోర్టునే బురిడీ కొట్టించిన గంజాయి స్మగ్లర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం కోర్టులో ఫేక్​ ష్యూరిటీలు కలకలం రేపాయి. ఫేక్​ ష్యూరిటీలతో గంజాయి స్మగ్లర్లు బెయిల్​ పొంది తప్పించుకొని తిరుగుతుండగా, పోలీసులు వెతుకుతున్నారు. ఈ విషయంపై ఖమ్మం జిల్లా ఈర్లపూడి పంచాయతీ సెక్రటరీ కె. ఈశ్వరాచారి కొత్తగూడెం పోలీసులకు శుక్రవారం కంప్లైంట్​ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల కింద కొత్తగూడెం పోలీసులు 800 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

 ఈ కేసులో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్​ అయిన వారికి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన ధరావత్​ నాణక్య, తేజావత్​ గొరియా అనే వారు ష్యూరిటీ ఇచ్చారు. ఆ తరువాత పోలీసులకు అనుమానం రావడంతో విచారణ చేయగా, అవి ఫేక్​ అని తేలింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి స్మగ్లర్లకు బెయిల్  ఇప్పించారని సెక్రటరీ కంప్లైంట్​ చేశారు. స్మగ్లర్ల బెయిల్​ను మెజిస్ట్రేట్​ రద్దు చేయడంతో వారిని అరెస్ట్​ చేయాలని ఆదేశించారు.

ఫేక్​ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న వ్యక్తి అరెస్ట్

వరంగల్​ సిటీ: ఆన్​లైన్ లో ఫేక్  సర్టిఫికెట్లను తయారు చేస్తున్న వ్యక్తిని మట్టెవాడ పోలీసులు శనివారం అరెస్ట్​  చేశారు. హన్మకొండలోని నయీంనగర్ కు చెందిన నల్లవెల్లి అమరేందర్  వరంగల్​ పోచమ్మ మైదాన్​లోని వేణురావుకాలనీలో హనుమాన్  ఆన్​లైన్  సెంటర్  పెట్టి అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ హైదరాబాద్, వరంగల్  మున్సిపల్, రెవెన్యూ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ వివిధ రకాల సర్టిఫికెట్లను తయారు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్  ఆఫీసర్లు, పోలీసులు తనిఖీలు నిర్వహించి, అమరేందర్ ను పట్టుకున్నారు. అతని ఫేక్​ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించే వస్తువులను సీజ్ చేశారు. అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.