సీఎం రేవంత్‌‌‌‌పై ఫేక్‌‌‌‌ పోస్టులు.. డీజీపీకి ఫిర్యాదు : ప్రభుత్వ విప్‌‌‌‌ బల్మూరి వెంకట్‌‌‌‌

సీఎం రేవంత్‌‌‌‌పై ఫేక్‌‌‌‌ పోస్టులు.. డీజీపీకి ఫిర్యాదు : ప్రభుత్వ విప్‌‌‌‌ బల్మూరి వెంకట్‌‌‌‌
  • ఫేక్‌‌‌‌ వీడియోలు, తప్పుడు ప్రచారంపై 
  • చర్యలు తీసుకోవాలి: బల్మూరి వెంకట్‌‌‌‌

సైఫాబాద్/ హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిపై సోషల్‌‌‌‌ మీడియాలో అసభ్యకర, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌‌‌‌ బల్మూరి వెంకట్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. సోమవారం లక్డీకాపుల్‌‌‌‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియా హ్యాండిల్స్‌‌‌‌ నుంచి సీఎం రేవంత్‌‌‌‌పై ఫేక్‌‌‌‌ వీడియోలు, తప్పుడు ప్రచారం జరుగుతున్నాయని, ఇందుకు సంబంధించిన వివరాలను డీజీపీకి అందజేసినట్లు తెలిపారు.

కేటీఆర్‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేకే సీఎం రేవంత్‌‌‌‌పై ఫేక్‌‌‌‌ ప్రచారం చేస్తున్నారని వెంకట్‌‌‌‌ ఆరోపించారు. 24 గంటల్లో తప్పుడు వీడియోలను తొలగించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు వెంకట్‌‌‌‌ తెలిపారు. 

అక్రమాస్తులపై సమాధానం చెప్పలేక అక్రమ సంబంధాలు అంటగడ్తవా? 

అక్రమంగా సంపాదించిన ఆస్తులపై తాము ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేని కేటీఆర్.. అక్రమ సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బల్మూరి వెంకట్ మండిపడ్డారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మీ ఇంట్లో ఆడవాళ్ల మీద అక్రమ సంబంధాలు అంటగట్టి ప్రచారం చేస్తే మీరు ఊరుకుంటారా..? అలాంటి వాటిని మీరు జీర్ణించుకోగలరా..? కొంచెమైనా సోయి ఉందా కేటీఆర్..?’’ అని ప్రశ్నించారు. ‘‘నీ ఇంటి ఆడబిడ్డను బయటకు నెట్టేశావు.. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పే సోయి లేక, మహిళలను కించపరిచే నీచమైన రాజకీయాలు చేయడం సిగ్గుచేటు’’ అని మండిపడ్డారు.