సిద్దిపేట జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

సిద్దిపేట జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు
  •     నెలరోజుల్లో 1.11 మీటర్ల దిగువకు
  •     అన్నదాతల్లో మొదలైన ఆందోళన

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. బోర్ల పై ఆధారపడి వరి సాగు చేస్తున్న రైతులు ఈ పరిస్థితిని చూసి తల్లడిల్లుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు వరి నాట్లు పడడంతో పాటు మొగి పురుగు కారణంగా కొంతమంది రెండోసారి వరి నాట్లు వేశారు. కానీ నెలాఖరునాటికి భూగర్భ జలాలు10.07 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలోని 25  మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 

ఒకవైపు భూగర్భ జలాలు పడిపోవడం మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతుండడం వల్ల వరి పంటకు నీటి అందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ సమస్య లేకున్నా ఊహించని విధంగా భూగర్భ జలాలు పడిపోతుండడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.  ప్రస్తుత రబీ సీజన్ లో 3.31 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుండగా వీరిలో అత్యధికంగా బోర్ల పైనే ఆధారపడినవారు ఉన్నారు.   

వేగంగా పడిపోతున్న  భూగర్భ జలాలు

జిల్లాలో సగటున 10.07 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో భూగర్భ జలాలు 8 మీటర్ల లోతులో ఉండగాఈసారి 2 మీటర్ల లోతుకు పడిపోయాయి.  కేవలం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో భూగర్భ జలాలు 1.11 మీటర్లు పడిపోయాయి.  జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో 22.05, దుబ్బాకలో19.23, ధూల్మిట్టలో 13.35 మీటర్ల దిగువకు భూగర్భజలాలు పడిపోయాయి. నీటి మట్టాలు వేగంగా పడిపోతుండడంతో బోర్లు వరి సాగుకు అవసరమైన నీటిని అందించ లేకపోతున్నాయి.

పంటను వదిలేస్తున్న రైతులు

నీటి లభ్యత లేకపోవడంతో రైతులు వరి పంటను వదిలేస్తున్నారు. సాగు విస్తీర్ణానికి తగినట్టుగా బోర్ల నుంచి నీరు రాకపోవడంతో దాదాపు 40 శాతం వరకు రైతులు పంటను పశువులను మేపుతున్నారు.  కొన్ని చోట్ల వరి మడులకు నీరందక పగుళ్లతో ఎండిపోయి కనిపిస్తున్నాయి. మార్చి ఆరంభంలోనే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లాలో బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట, నంగునూరు, కొండపాక, కుకునూరుపల్లి, చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతోంది.

ఎకరం పంట ఎండిపోయింది

నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తే సరిపడా నీరు లేక ఇప్పటికే ఎకరం ఎండింది.  మిగతా మూడెకరాల పంటైనా చేతికస్తుందో లేదో తెలియడం లేదు. ఇప్పటికే పెట్టుబడి కోసం వేల రూపాయలు ఖర్చు చేశా. రబీసాగులో నష్టం వస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు.
బండారు మల్లయ్య , రైతు కూరెళ్ల

కొండపాక మండలం దుద్దెడకు చెందిన యాదగిరి రబీ సీజన్ లో ఎకరం పొలంలో వరి వేశాడు. విత్తనాలు, మందుల కోసం దాదాపు రూ.30 వేలు ఖర్చు చేశాడు. ఫిబ్రవరి నెలాఖరుకు ఎకరంలో  20 గుంటలకు నీరందక ఎండిపోయింది.  భూగర్భ జలాలు పడిపోవడంతో బోరు నుంచి నీరు రాక  మిగతా 20 గుంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్క యాదగిరి ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు బోర్ల పై సాగు చేస్తున్న జిల్లాలోని రైతులందరిదీ ఇదే కథ.