అమ్మానాన్నా.. సారీ

అమ్మానాన్నా.. సారీ

ఉద్యోగం లేదు. ఇంట్లో ఆర్థిక సమస్యలు. కుటుం బం గడవడం కష్టమైంది. చేసిన చిన్న అప్పులే పెద్దవిగా కనిపించాయి. దీంతో భార్య, కొడుకుతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడో వ్యక్తి. ‘‘క్షమించండి అమ్మ, నాన్న. నాకు బతికే అర్హత లేదు. నాన్నా.. దయచేసి నా అప్పులు తీర్చగలవు” అని సూసైడ్ నోట్ రాశాడు. తర్వాత ముగ్గురూ పురుగుల మందు తాగారు. ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి మిర్యాలగూడలో జరిగిందీ ఘటన.

పురుగుల మందు, కూల్ డ్రింక్ కలుపుకుని..

మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్​నగర్​కు చెందిన పారేపల్లి లోకేశ్వర్​కు 12 ఏళ్ల కిందట నల్గొండకు చెందిన చిత్రకళ(36)తో పెళ్లి జరిగింది. వీరికి లోహిత్​కుమార్ (11), శ్రీ విఘ్నేశ్​అనే ఇద్దరు కొడుకులున్నారు. ఎనిమిదేళ్లపాటు దామరచర్ల సమీపంలోని పవర్​ప్లాంట్​లో పనిచేసిన లోకేశ్వర్.. ఏడాది కిందట అక్కడ ఉద్యోగం మానేశాడు. తర్వాత స్థానికంగా రైస్​మిల్లులో గుమస్తాగా చేరాడు. కొన్నాళ్లకు దాన్నీ మానేశాడు. ఈక్రమంలో కుటుంబం గడవక లోకేశ్వర్ ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించిన తండ్రి పారేపల్లి సురేందర్.. నెల రోజుల కింద వారిని తన సొంత ఇంటికి తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సురేందర్ తన భార్యతో కలిసి​ మంగళవారం నల్గొండలోని పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లారు. ఆర్థిక సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన లోకేశ్వర్.. ఇంట్లో​ఎవరూలేని సమయం చూసి పురుగుల మందు, కూల్​ డ్రింక్​ తీసుకొచ్చాడు. భార్య చిత్రకళ, పెద్ద కొడుకు లోహిత్​కుమార్​తో కలిసి పురుగుల మందు తాగాడు. చిన్న కొడుకు శ్రీ విఘ్నేశ్ అప్పటికే నిద్రపోవడంతో చిన్నారిని లేపలేదు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత హైదరాబాద్​లో ఉంటున్న తన సోదరికి ఫోన్​చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు, సోదరునికి చెప్పగా.. వారు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే లోకేశ్వర్ ఇంటి వద్దకు పోలీసులు వెళ్లగా, అప్పటికే చిత్రకళ, లోహిత్​కుమార్​చనిపోయారు. లోకేశ్వర్​ను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడటంతో ప్రైవేట్​ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు.

చిల్లర అప్పులు.. ఇంతదాక తెచ్చుకుండు

‘నేను అన్​ఎంప్లాయ్​ని. నాకు ఉద్యోగం లేదు’ అని ఎప్పుడూ దిగులుగా ఉండే వాడు. కొన్ని రోజులు బయట ఉంటామని వెళ్లి మా నుంచి దూరంగా ఉన్నడు. ఇబ్బందుల్లో ఉన్నడని ఇంట్లోకి తీసుకొచ్చిన. ‘నేనున్న. నేను బతికి ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంట’ అని చెప్పిన. ఏమైందో, ఏం జరిగిందో తెలియదు. చిల్లర అప్పులు తప్ప పెద్దగా లేవు. ఆత్మనూన్యత భావంతో ఇంతదాక తెచ్చిండు. దయచేసి ఎవరూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఫ్యామీలీ మెంబర్స్​ను బాధ పెట్టొద్దు. ధైర్యంగా పోరాడండి.. జీవించండి.   – లోకేశ్వర్ తండ్రి సురేందర్