
- నలుగురు కుటుంబసభ్యులు కలిసి నకిలీ పత్రాలు సృష్టించి టోకరా..
- ఇద్దరి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ
ఆదిలాబాద్, వెలుగు: నలుగురు కుటుంబసభ్యులు కలిసి మున్సిపాలిటీలోని రోడ్డుకే ఎసరు పెట్టారు. ఏకంగా రోడ్డుకు ఇంటి నంబర్ సృష్టించి కబ్జా చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలో
వెలుగుచూసింది. బుధవారం సాయంత్రం డీఎస్పీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శాంతినగర్‌కు చెందిన రంగినేని శ్రీనివాస్ రావు తండ్రి సూర్యప్రకాశ్‌తో కలిసి తమ కాలనీలోని రోడ్డుకు నకిలీ పత్రాలు సృష్టించాడు. మున్సిపాలిటీ ద్వారా అసెస్మెంట్ తీసుకొని, డోర్ నంబర్ 1-1-54/5/1/A/1 చేసుకొని కబ్జాకు పాల్పడ్డాడు.
ఇంటికి నకిలీ చలాన్లు, పన్నులు చెల్లించినట్లు రశీదులు సైతం తీసుకున్నాడు. ఆ స్థలాన్ని తన సోదరి శ్వేత పేరు మీద మ్యూటేషన్ చేసుకు న్నారు. శ్వేత భర్త అముల్ సైతం ఈ కుట్రలో భాగమయ్యాడు. నలుగురు కలిసి రోడ్డుకు క్రమబద్దీకరణ ఉత్తర్వులు సృష్టించారు. కాలనీకి చెందిన కౌటీవార్సుశీల్తన పరిశ్రమకు సమీపంగా ఉన్న రోడ్డును ఆక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నలుగురిపై కేసులు నమోదు చేసి శ్రీనివాసరావు, బావ అమూల్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, రూరల్ సీఐ ఫణిదర్, సిబ్బంది పాల్గొన్నారు.