ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ : ఇంటి దగ్గరకే వచ్చి ట్రీట్ మెంట్

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ : ఇంటి దగ్గరకే వచ్చి ట్రీట్ మెంట్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ సేవలను గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రారంభించారు. ఏప్రిల్ 6నుంచి ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ దేశానికే రోల్‌ మోడల్‌ అని కితాబిచ్చారు. ఈ పథకంలో భాగంగా వైద్యులే గ్రామానికి వచ్చి సేవలు అందిస్తారని, పేదలు ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం స్పష్టం చేశారు. అన్ని వైద్య సేవలు ఇంటి వద్దకే అందించే ఈ గొప్ప పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

మంచానికి పరిమితమైన రోగులకు ఇంటివద్దే వైద్యం ఎంతో ఉపయోగపడుతుందన్న ఆయన,.. ప్రతి పేద వ్యక్తికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను తీసుకోచ్చామని చెప్పారు. విలేజ్‌ క్లినిక్‌లో 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డాక్టర్ సేవల ద్వారా స్పెషలిస్ట్‌ డాక్టర్ల కూడా గ్రామాల్లో వైద్యం అందిస్తారని చెప్పారు.

పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని, 3800 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీని పెంచామని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. వైద్యారోగ్య రంగంలో 48వేల 600 ఉద్యోగాలు కల్పించామన్న ఆయన.. వైఎస్సార్‌ చనిపోయిన ఆరోగ్య శ్రీని నీరుగార్చారని ఆరోపించారు. ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా పేదలకు అందించిన మహానేత వైఎస్సార్‌ అని ఆయన కొనియాడారు. వైఎస్సార్‌ విలేజ్‌​క్లినిక్‌లో 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని, ఈ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తామని చెప్పారు.

సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతీ పీహెచ్‌సీలో అందుబాటులో ఇద్దరు డాక్టర్లు ఉంటారని చెప్పారు. 24/7 పేదలకు వైద్యం అందించాలని అధికారులను సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్‌ పరిధిలో నయం కాని ఆరోగ్య సమస్యలను విలేజ్‌ క్లినిక్‌ ద్వారా ఆరోగ్యశ్రీకి రిఫర్‌ చేస్తామని స్పష్టం చేశారు.