దేవెగౌడ లెక్కలే ఎసరు తెచ్చాయా!

దేవెగౌడ లెక్కలే ఎసరు తెచ్చాయా!

దేవెగౌడ ఫ్యామిలీ ఎఫైర్స్​తో జనతా దళ్​ (ఎస్​) చీలిక దిశగా పోతోందని చెబుతున్నారు.  అధికారంకోసం పాకులాడడం తప్ప ప్రజల్ని దేవెగౌడ పట్టించుకోరని బలంగా వినిపిస్తోంది. పోయినేడాది ఎన్నికల తర్వాత పొత్తు కలిసిన కాంగ్రెస్​ కూడా ఇకపైన జేడీ(ఎస్​)తో స్నేహం చెడిందని ఓపెన్​గా చెబుతోంది.  గతంలో బీజేపీతో ఒప్పందం చేసుకుని పవర్​ బదిలీలో మాట తప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. దేవెగౌడకు నమ్మకస్తులైన  సొంత కులస్తులుసైతం దూరందూరంగా ఉన్నారని వినికిడి.

దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యంగల రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక. మొదటి రాష్ట్రంలో పూర్తిగా ప్రాంతీయ పార్టీలదే హవా. కర్ణాటకలో మాత్రం జాతీయ పార్టీలు బలంగా ఢీకొంటూ ఉంటాయి. ఎమర్జెన్సీకి ముందు కాంగ్రెస్​ రాజకీయాల్లో కర్ణాటకకు చెందినవారే చక్రం తిప్పారు. ఆ తర్వాత జనతా పార్టీ పుట్టినప్పటినుంచీ కన్నడ పొలిటీషియన్లే కీలక పాత్ర పోషించారు. రామకృష్ణ హెగ్డే, జార్జి ఫెర్నాండెజ్, జె.హెచ్​.పటేల్​​లాంటివాళ్లు అక్కడి నుంచే వచ్చారు. జనతా పార్టీ చీలిపోయినా కర్ణాటకలో మాత్రం జనతాదళ్​ పేరుతో దాదాపు 20 ఏళ్లు మనుగడ సాగించింది.  1999లో జనతా దళ్​ (సెక్యులర్​)గా హెచ్​.డి.దేవెగౌడ నాయకత్వంలో ఏర్పడింది. కన్నడ రాజకీయాల్లో అటు బీజేపీతోనూ, ఇటు కాంగ్రెస్​తోనూ అవకాశాన్ని బట్టి దోస్తీ చేస్తూ అధికారం అనుభవించింది.

జనతా దళ్​ బేనర్​ మీద దేవెగౌడ ఒకసారి, జనతాదళ్​(ఎస్​) పార్టీ తరఫున ఆయన చిన్న కొడుకు హెచ్​.డి.కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రులయ్యారు. కానీ, ఏ ఒక్కరూ పూర్తి కాలం కాదుగదా, కనీసం రెండేళ్ల పదవీకాలాన్నయినా పూర్తి చేయలేకపోయారు. దీనికి కారణం దేవెగౌడ సాగించే అవకాశవాద రాజకీయాలే కారణమంటారు పొలిటికల్​ ఎనలిస్టులు. దేవెగౌడ తాను నేర్చిన రాజకీయాన్నే కొడుక్కికూడా నేర్పడంతో కుమారస్వామి అధికారంకోసం పొత్తులు కుదుర్చుకుంటుంటారు.

మొదటిసారి 2006–07 మధ్య కాలంలో బీజేపీ సాయంతో ఏడాదిన్నరపాటు ముఖ్యమంత్రి పీఠమెక్కారు. అప్పట్లో జనతాదళ్​(ఎస్​)కిగల బలం 59 సీట్లే. 224 స్థానాల కర్ణాటక అసెంబ్లీలో ఆ పార్టీ హయ్యస్ట్​ సీట్లు గెలిచిన సందర్భం అదొక్కటే. కొంతకాలం తాను సీఎంగా కొనసాగాక బీజేపీ నాయకుడు యడియూరప్పకు అధికారం బదలాయించే ఒప్పందంపై కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తీరా పవర్​ ట్రాన్స్​ఫర్​ చేయాల్సిన సమయం వచ్చేసరికి మొండిచేయి చూపించారు. మళ్లీ 5 ఏళ్లకు మరోసారి అతి తక్కువ సీట్లతో కాంగ్రెస్​ సాయంతో కుమారస్వామి అధికారం దక్కించుకున్నారు.

2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చినాగానీ,  కాంగ్రెస్​ తన 66మందినీ జేడీ(ఎస్​)కి మద్దతుగా నిలబెట్టింది. దాంతో 37 సీట్లు మాత్రమే గెలిచిన బేడీ(ఎస్​) ప్రభుత్వం కుమారస్వామి నేతృత్వంలో ఏర్పడింది. తొలి రోజునుంచే మంత్రి పదవుల పంపకంపై రెండు పార్టీల మధ్య తగాదా మొదలైంది. ఒడిదొడుకులతో సాగిన కాంగ్రెస్​–జేడీ(ఎస్​) స్నేహం చివరకు 14 నెలల తర్వాత బెడిసికొట్టింది. దాదాపు జూలై నెలంతా సాగిన హైటెన్షన్​ పొలిటికల్​ డ్రామాలో కుమారస్వామి అర్ధంతరంగా దిగిపోక తప్పలేదు. ఆయన స్థానంలో యడియూరప్ప (బీజేపీ) సీఎం అయ్యారు.

బీజేపీకి అసెంబ్లీలో కావలసిన మేజిక్​ ఫిగర్​ సొంతంగానే ఉంది కాబట్టి, ఇప్పట్లో ఆయన ప్రభుత్వానికి వచ్చిన పరమాదమేదీ ఉండదు. ఇప్పుడందరి దృష్టీ జనతాదళ్​, కాంగ్రెస్​ పార్టీల దోస్తానామీదే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన రెండు పార్టీలు అధికారంకోసమే జట్టు కట్టాయన్న ఫీలింగ్​ జనంలో బాగా ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రజలు తమవైపు లేరన్న సంగతి దేవెగౌడ ఫ్యామిలీకి తెలిసినప్పటికీ, పెద్దగా పట్టించుకోదని, కాంగ్రెస్​ మాత్రం చాలా సీరియస్​గా దీనిపై ఆలోచిస్తోందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్​ నాయకుల కామెంట్లు ఉంటున్నాయి.

ఇంతకాలం తాము సంకీర్ణ ధర్మానికి కట్టుబడి జేడీ(ఎస్​) చేసిన పనుల్ని మౌనంగా భరించామని, ఊపిరి పీల్చుకునే వెసులుబాటు వచ్చిందని ఒక కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు అన్నారు. ఇకపైన వచ్చే ఉప ఎన్నికల్లోగానీ, మధ్యంతర ఎన్నికల్లోగానీ తాము ఎప్పటిలాగే ఒంటరిగానే ఫైట్​ చేస్తామని బల్లగుద్ది చెబుతున్నారు. కాంగ్రెస్​, జేడీ(ఎస్​) దక్షిణ కర్ణాటకలో ముఖ్యంగా పాత మైసూర్​ ప్రాంతంలో ఉప్పు–నిప్పులా ఉంటాయి. కొయిలేషన్​కోసం రెండు స్నేహం నటించాయని,కుమారస్వామి దిగిపోవడంతో జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయని ఎక్స్​పర్ట్​లు అంటున్నారు. ‘నిజానికి జేడీ(ఎస్​)తో కలవడం మా కార్యకర్తలు ఎవరికీ ఇష్టం లేదు. ఇకపైన మేము కార్యకర్తల ఇష్టానికి తగ్గట్టే వ్యవహరిస్తాం’ అని ఒక సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడన్నారు.

జనతాదళ్​ (ఎస్​) నాయకులుకూడా అదే ఫోర్స్​లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్​ గెలుచుకున్న రాజరాజేశ్వరి నగరలో మేము, మా పార్టీ గలిచిన మహాలక్ష్మి లేఅవుట్​ స్థానంలో కాంగ్రెస్​ పోటాపోటీగా కేండిడేట్లను నిలబెట్టుకోవడం ఖాయం’ అన్నారు జేడీ(ఎస్) నాయకుడు తన్వీర్​ అహ్మద్​. ఈ రెండు నియోజకవర్గాలు వచ్చే లోక్​సభా స్థానాలను బీజేపీయే గెలుచుకుంది. కొందరు జేడీ(ఎస్​) నాయకులు మాత్రం ఎవరితోనైనా కలుస్తామంటున్నారు. ‘బీజేపీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీతో మేము కలుస్తాం. అప్పటివరకు మేము ఎదురుచూస్తుంటాం’ అని ఆశతో ఉన్నారు.

ఎన్నికలలో కలిసిరాని కార్యకర్తలు

2018 మే నెలలో కుదుర్చుకున్న పొత్తువల్ల ఘోరంగా దెబ్బతిన్న పార్టీగా కాంగ్రెస్​ మిగిలిపోయింది. నాలుగు నెలల క్రితం జరిగిన జనరల్​ ఎలక్షన్స్​లో కర్ణాటకలోని 28 లోక్​సభ సీట్లకుగాను కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానం దక్కించుకుంది. ఖాయంగా గెలవడానికి ఛాన్స్​న్న మండ్య లోక్​షభ సీటుని జేడీ(ఎస్​)కి వదులుకోవలసి వచ్చింది. ఈ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి అంబరీశ్​ భార్య, సినీ నటి సుమలత ఇండిపెండెంట్​గా బీజేపీ మద్దతుతో గెలిచారు. మండ్యలో కాంగ్రెస్​ కార్యకర్తలెవరూ జేడీ(ఎస్​)కి సపోర్ట్​ ఇవ్వలేదు. ఈ సీటులో దేవెగౌడ మనవడు, కుమారస్వామి కొడుకు నిఖిల్​ కుమార్​ నిలబడి, లక్షా పాతికవేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు.  కాంగ్రెస్​, జేడీ(ఎస్​) కార్యకర్తలెవరూ కలసిరాకపోవడంవల్లనే బీజేపీ 25 సీట్లలో కాషాయ జెండా నెగరేసింది.  స్వయానా దేవెగౌడ సొంత నియోజకవర్గమైన హసన్​లో మరో మనవడు ప్రజ్వల్​ రేవణ్ణ నిలబడినా, కాంగ్రెస్​ కార్యకర్తలు దూరందూరంగానే ఉన్నారు. చివరకు దేవెగౌడ రంగంలో దిగి అందరినీ బుజ్జగించడంతో సుమారు 59 వేల ఓట్లతో ప్రజ్వల్​ నెగ్గగలిగారు. దేవెగౌడ 2014లో ఇదే స్థానాన్ని లక్ష పైచిలుకు మెజారిటీతో గెలవడాన్ని గుర్తు చేసుకుంటే, ప్రజ్వల్​ సగం మెజారిటీతోనే గట్టెక్కారని చెప్పాలి.

జేడీ(ఎస్​)కి మరో బెడద మొదలైంది. దేవెగౌడ సామాజికవర్గమైన ఒక్కలిగ కులస్తుల ప్రాబల్యం ఈ పార్టీలో ఎక్కువ. అలాంటిది మాజీ మంత్రులైన ఎస్​.ఆర్​.మహేశ్​, జి.టి.దేవెగౌడ, సి.ఎస్​.పుట్టరాజు వంటి ఒక్కలిగ నాయకులు దేవెగౌడ ఫ్యామిలీ ఎఫైర్స్​పై అలుగుతున్నారు. కుమారస్వామి కొడుకు, సినీ నలుగు అయిన నిఖిల్​ ఒక సందర్భంలో పుట్టరాజును అవమానించారని, దాంతో ఆయన పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని జేడీ(ఎస్​) వర్గాలు చెబుతున్నాయి. మరో నాయకుడు జి.టి.దేవెగౌడ ఓపెన్​గానే యడియూరప్పకు మద్దతు ప్రకటించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చాముండేశ్వరి స్థానంలో పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టిన లీడర్. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే… త్వరలోనే జనతాదళ్​ (సెక్యులర్​)కి సెక్యూరిటీ లేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

అంతా ఫ్యామిలీ ఎఫైరే

జనతా దళ్​ (ఎస్​)ని హెచ్.డి.దేవెగౌడ పూర్తిగా తన కుటుంబ పార్టీగా మార్చేశారు. దేడెగౌడ ఎంపీగా, పెద్ద కొడుకు రేవణ్ణ, చిన్న కొడుకు కుమారస్వామి, ఇతని భార్య అనిత కుమారస్వామి ఎమ్మెల్యేలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం దేవెగౌడ్​ ఏ సభలోనూ సభ్యులుగా లేరు. మూడో తరానికి చెందిన నిఖిల్, ప్రజ్వల్​: ఎంపీలుగా బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  ఈ వ్యవహారాన్ని ఎవరూ ప్రశ్నించినా పెద్దాయనకు కోపం వస్తుందని పార్టీ వర్గాలు అంటుంటాయి.

కుమారస్వామి ఫ్యామిలీ : దేవెగౌడ చిన్న కొడుకు కుమారస్వామి ప్రస్తుతం చెన్నపట్న నుంచి, ఆయన భార్య అనిత రామనగర నుంచి ఎమ్మెల్యేలు. వీరి కొడుకు నిఖిల్​ సినీ నటుడు. మండ్య నుంచి లోక్​సభకు పోటీ చేసి ఓడిపోయారు.

రేవణ్ణ ఫ్యామిలీ : దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ ప్రస్తుతం హోళెనరసిపుర నుంచి ఎమ్మెల్యే. భార్య భవానీ రాజకీయాల్లో లేరు. వీరి కొడుకు ప్రజ్వల్​ హసన్​ నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు.