దేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే

దేశ యువతను కుటుంబ పార్టీలు ఎదగనిస్తలే

న్యూఢిల్లీ: ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మోడీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. జన్ సంఘ్ నుంచి బీజేపీ ఆవిర్భావం, ఇప్పటి వరకు పోరాడిన, బలిదానాలు చేసిన కార్యకర్తల సేవల్ని గుర్తు చేసుకున్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు, యువత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేయడమే తమ పార్టీ ఉద్దేశమన్నారు. అందుకే ఆయా వర్గాలు తమ పార్టీకి మద్దతుగా ఉంటున్నాయని చెప్పారు. 
 
రాజనీతి, రాష్ట్రనీతి సమానం

‘నారీశక్తి భారత భవిష్యత్ కు దిశను ఇస్తోంది. మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం చాలా కృషి చేస్తున్నాం. మా దృష్టిలో రాజనీతి, రాష్ట్రనీతి (రాజకీయం-.. జాతీయ విధానం) సమానంగా వెళ్తాలి. కానీ ఇప్పుడు దేశంలో రెండు రకాల రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకటి కుటుంబ రాజకీయాలు, ఇంకొకటి దేశభక్తి రాజకీయాలు. కుటుంబ పార్టీల్లో అన్ని వ్యవస్థల్లోనూ వారి వారసులదే అధికారం. ఇలాంటి పార్టీలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీని నుంచి దేశాన్ని బయటపడేసే పార్టీ బీజేపీనే. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా గళమెత్తింది బీజేపీనే. అందుకే దేశ యువత, ప్రజలు కుటుంబ పార్టీలు ఎంత ప్రమాదమో అర్థం చేసుకుంటున్నారు’ అని మోడీ చెప్పారు. కుటుంబ పార్టీలు యువతను ఎదగనివ్వకుండా చేస్తున్నాయని దుయ్యబట్టారు. 

రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం

‘వ్యాక్సినేషన్ కోసం కేంద్రం రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఏడున్నరేళ్ల పాలనలో పేదలకు పక్కా ఇళ్లతోపాటు బాత్రూమ్ లు కట్టించాం. ఆయుష్మాన్ భారత్, ఉజ్వల పథకంతోపాటు ఇంటింటికీ నీరు, ప్రతి పేదోడికి బ్యాంక్ అకౌంట్ లాంటివెన్నో చేశాం. అందరి విశ్వాసాన్ని చూరగొంటున్నాం. దేశాభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం. సమాజంలోని అట్టడుగు వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే మా లక్ష్యం. సామాజిక న్యాయం ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో జాగరూకత తీసుకురావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు టక్కర్ ఇవ్వడంలో బీజేపీ సఫలమైంది. అందుకే ప్రజల నుంచి మా పార్టీకి ఆదరణ దక్కుతోంది’ అని మోడీ అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగించే ప్రభుత్వాలపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశ సేవ కోసం అనునిత్యం కృషి చేయాలంటూ కార్యకర్తలు, నేతలకు సూచించారు. తాను కూడా ఓ కార్యకర్తలా పార్టీ ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తానన్నారు. దేశాన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తల కోసం:

దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే

కచ్చాబాదం సాంగ్కు డ్యాన్స్ చేసిన మాధురీ స్టెప్స్