నారాయణ్ ఖేడ్, వెలుగు: తమ కూతురు మృతికి ప్రియుడే కారణమని ఆరోపిస్తూ డెడ్ బాడీతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్గాపూర్ మండలం కడ్చల్ విఠల్ నాయక్ తండాకు చెందిన వడ్త్యా కావేరి(23), నిజాంపేట మండలం మునిగేపల్లి మాణిక్ నాయక్ తండాకు చెందిన సబావత్ శ్రీకాంత్(24), ప్రేమించుకున్నారు.
పెండ్లి చేసుకోవాలనుకోవడంతో పెద్దలు నిరాకరించారు. దీంతో హైదరాబాద్ కు వెళ్లి సహజీవనం చేస్తున్నారు. కాగా.. హైదరాబాద్ బాలాపూర్ ఏరియాలో ఉంటున్న ఇంట్లో రెండు రోజుల కింద కావేరి ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి బం ధువుల ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీని అప్పగించారు.
శనివారం రాత్రి కావేరి డెడ్ బాడీని తీసుకుని మాణిక్ తండాకు వెళ్లి శ్రీకాంత్ ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కగ్టి సీఐ వెంకట్ రెడ్డి, కల్హేర్ ఎస్ఐ రవిగౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు తండాలకు చెందిన పెద్దలతో మాట్లాడి సయోధ్య కుదిర్చి శాంతిపజేశారు. అనంతరం కావేరి అంత్యక్రియలను శ్రీకాంత్ కుటుంబ సభ్యులు నిర్వహించేందుకు అంగీకరించారు.
