గణేషుడి ప్రముఖ దేవాలయాలు ఇవే..

గణేషుడి ప్రముఖ దేవాలయాలు ఇవే..

గణపతికి పూజిస్తే ఎలాంటి పనులైనా నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తులు నమ్ముతారు. వినాయకచవితిని భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. వాడవాడల భారీ విగ్రహాలను పెట్టి ఉత్సవాలను జరుపుతారు. సెప్టెంబర్ 18 న వినాయకచవితి జరుపుకుంటున్న నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖమైన వినాయకుని ఆలయాలేంటో తెలుసుకుందాం.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన రహదారికి సమీపంలో  శ్రీ సిద్ది వినాయక దేవాలయం తెలంగాణ ప్రాంతంలోని ప్రసిద్ద దేవాలయాలలో ఒకటి.  ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం 1824వ సంవత్సరంలో ఒక బావాలో దొరికిందని.. కంచి పీఠానికి చెందని శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ విగ్రహాన్ని  ప్రతిష్ఠించారని చెబుతారు.  ఈ ఆలయం ఆగమశాస్త్రాల ఆధారంగా నిర్మించబడిందని పండితులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే కైలాసంలో ఉండే  శివుని అనుగ్రహం కలుగుతుందట.  ఈ ఆలయంలో ప్రధాన దేవత గణేష్ విగ్రహంతో పాటు శివుడు, పార్వతి,శ్రీ వల్లీ దేవసేన సమేత సుభ్రమణ్యస్వామి, హనుమాన్   విగ్రహాలు ఉన్నాయి.  దాదాపు 200 సంవత్సరాలనాటి ఈ దేవాలయంలో స్వయంభుగా వెలసిన వినాయకుడు, విరుపాక్ష గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు.

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయక దేవాలయాన్ని 11 వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. విగ్రహం తలపై తెలుపు, పసుపు, ఎరుపు రంగులు కలిగి ఉంటుంది. గణేశ్ చతుర్థి ఇక్కడ వైభవంగా జరుపుతారు.

చెన్నైలోని వరసిద్ధి వినాయక ఆలయం బీసెంట్ నగర్‌లో ఉంది. ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయం. ప్రతి సంవత్సరం వినాయకచవితికి దేశ వ్యాప్తంగా అనేకమంది భక్తులు ఇక్కడి వస్తారు.

ముంబయి సిద్ధి వినాయకుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి ప్రముఖులు వస్తుంటారు. 1801 లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడి గణేశుని నవాసాచ గణపతి  అని కూడా పిలుస్తారట. ఇక్కడి గణపతి కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు.

రాజస్థాన్‌లోని రణతంబోర్ గణేశ్ ఆలయం.. భారతదేశంలోనే పురాతన గణేశ్ దేవాలయంగా దీనిని చెబుతారు. శ్రీకృష్ణుడు భార్య రుక్మిణితో  వివాహమైన సమయంలో ఈ ఆలయాన్ని దర్శించారని చెబుతారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వివాహ ఆహ్వానాలు, బహుమతులు అందుతాయి. ఎవరైనా ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటపుడు ఈ ఆలయంలో ఆశీర్వాదం తీసుకుంటారు.

పూణేలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి గణపతి దేవాలయంలో 7.5 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో ఉండే భారీ గణపతి విగ్రహం ఉంటుంది. విలువైన బంగారు ఆభరణాల్లో గణపతిని అలంకరిస్తారు. ఇక్కడి నుంచే లోకమాన్య బాలగంగాధర తిలక్  గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారని చెబుతారు. 

తిరుచిరాపల్లిలోని ఉచ్చి పిళ్లయార్ ఆలయం రాక్ ఫోర్ట్ పైభాగంలో  ఆలయం ఉంది. ఈ ఆలయం మొత్తం అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు. విజయనగర సామ్రాజ్య పాలకుల కాలంలో మధురైకి చెందిన నాయక్ పాలకులు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసారు. ఈ ఆలయంలోని గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

Also Read :- వినాయకచతుర్ధి రోజు పాలవెల్లి ఎందుకు కడతారో తెలుసా...

కొంకణ్‌లోని రత్నగిరి జిల్లాలో ఉన్న గణపతి పూలే ఆలయం ప్రసిద్ధి. ఈ ఆలయంలోని గణపతి విగ్రహం 400 ఏళ్ల నాటిది. ఈ విగ్రహం సహజంగా పరిణామం చెందిందని నమ్ముతారు. సాధారణంగా దేవుడి విగ్రహాలు అన్నీ తూర్పు దిక్కులు ఉంటాయని అంటారు. ఈ ఆలయంలో గణపతి విగ్రహం పశ్చిమం వైపు తిరిగి ఉంటుంది.

 జైపూర్‌లోని మోతీ డుంగ్రి గణేశ్ ఆలయం 250 సంవత్సరాల క్రితం నిర్మించారు. 1761 లో నిర్మించినట్లు చెబుతారు. కోటలు, కొండల మధ్య నిర్మించబడిన ఈ ఆలయం జైపూర్‌లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది జైపూర్ సిటీకి 6 కి.మీటర్ల దూరంలో ఉంది.

కేరళలోని కలమస్సేరి మహాగణపతి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో శివుడు, పార్వతీ దేవి, శ్రీరాముని విగ్రహాలు కూడా ఉంటాయి. 1980 లో ఈ ఆలయం నిర్మించారు. ఈ ఆలయం హైవేకి దగ్గరగా ఉంటుంది. అందువల్ల యాత్రికులు ఈ ఆలయాన్ని రోడ్ సైడ్ గణపతి అని పిలుస్తారట. 

కాంచన్‌జుంగా పర్వాతల మధ్య కొండ శిఖరంపై ఉన్న గణేశ్ టోక్ టెంపుల్ గ్యాంగ్‌టక్ లోని అందమైన దేవాలయం. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. చుట్టూ పచ్చదనం, బారులు తీరిన చెట్లు ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.