చెరువులకు నీటి సంఘాలతోనే రక్షణ చెరువులుంటునే వ్యవసాయం, మత్స్య సంపద వృద్ధి: కోదండరెడ్డి

చెరువులకు నీటి సంఘాలతోనే రక్షణ చెరువులుంటునే వ్యవసాయం, మత్స్య సంపద వృద్ధి: కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చెరువుల సంరక్షణకు నీటి సంఘాల ఏర్పాటు అత్యవసరమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం హర్షణీయమని తెలిపారు. చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం కూడా అవసరమన్నారు. గురువారం ఆయన బిఆర్కే భవన్‌‌లోరిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  కోదండరెడ్డి మాట్లాడుతూ.." రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. 

శిఖం పట్టా భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని చెరువుల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటైనట్లు కమిషన్ దృష్టికి వచ్చింది.  చెరువుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం.  దీనిపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం.  చెరువులు సురక్షితంగా ఉంటేనే వ్యవసాయం, మత్స్య సంపద వృద్ధి చెందుతాయి. నీటి సంఘాల కమిటీల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతోపాటు ఆదర్శ రైతులు, చేపల పెంపకందారులు, యువతకు అవకాశం కల్పించాలి" అని వివరించారు. కమిటీల నియామకంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని కోదండ రెడ్డి పేర్కొన్నారు.