
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విస్తరించి భారీగా ఉపయోగంలో ఉన్నప్పటికీ.. నగదు చెల్లింపులు ఇప్పటికీ కింగ్ గానే కొనసాగుతోంది. అయితే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రజలు రోజుకు ఎంత వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయెుచ్చు.. దానిని దాటితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయాల గురించి చాలా మంది ప్రజలకు అవగాహన లేదు.
మీరు పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ ఈ లావాదేవీలను కచ్చితంగా పర్యవేక్షిస్తోంది. భారీ మొత్తంలో నగదు స్వీకరించడంపై పన్ను చట్టంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం ఒక వ్యక్తి రోజులో రూ.2 లక్షలకుపైగా నగదును స్వీకరించకూడదు. ఒకే వ్యక్తి నుంచి ఒక రోజులో అయినా, ఒకే లావాదేవీకి అయినా, లేదా ఒకే సందర్భానికి సంబంధించిన పలు లావాదేవీల ద్వారా అయినా లిమిట్స్ దాటకూడదు. ఉదాహరణకు మీరు ఒక ప్రాపర్టీ డీల్‌లో రూ.3 లక్షలు నగదుగా తీసుకున్నట్లయితే అది చట్ట విరుద్ధం అవుతుందన్నమాట.
చట్టప్రకారం బాధ్యత నగదు తీసుకునే వ్యక్తిపైనే ఉంటుంది. నగదు చెల్లించే వ్యక్తిపైన కాదు. అంటే మీకు చెల్లించిన వ్యక్తి మంచి నమ్మకంతో ఇచ్చినా సరే.. మీరు తీసుకున్న మొత్తం రూ.2 లక్షల కంటే ఎక్కువైతే పన్ను శాఖ చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉంది. దీని ప్రకారం వ్యక్తి డబ్బు రూపంలో ఎంత మెుత్తాన్ని పొందారో అంతే మెుత్తాన్ని జరిగామానాగా విధించే అధికారం ఆధాయపు పన్ను అధికారులకు ఉంది. అంటే 100 శాతం జరిమానా అన్నమాట.
ALSO READ : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దర్యాప్తు..
అయితే కొన్ని సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ సంస్థలు తమ అధికారిక పనుల్లో నగదు స్వీకరించినా నిబంధనకు విరుద్ధం కాదని పన్ను చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ మినహాయింపులు ప్రభుత్వ విధులకే పరిమితమని పన్ను నిపుణులు వివరించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలు పరిమితికి మించి డబ్బు చెల్లింపులు చేయాలన్నా లేదా పొందాలన్నా అందుకు బ్యాంకింగ్ మార్గాన్ని ఎంచుకోవాలని ఐటీ అధికారులు చెబుతున్నారు. పెద్ద చెల్లింపుల కోసం చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్, NEFT, RTGS లేదా యూపీఐ వంటి డిజిటల్ చానెళ్లను యూజ్ చేయటం సేఫ్ అని అధికారులు సూచిస్తున్నారు.