
- ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ
- టెట్ జీవోలో మార్పుల కోసం సర్కారుకు ప్రపోజల్
- సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ వచ్చేనెల రిలీజ్ కానున్నది. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఇన్ సర్వీస్ టీచర్లంతా టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెట్ జీవోలో మార్పులు చేయనున్నారు. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ, గత బీఆర్ఎస్ సర్కారు ఆ నిబంధనను పక్కన పడేసింది.
పదేండ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా రెండు సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రెండు సార్లు టెట్ నిర్వహించగా.. తాజాగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్యలు మొదలుపెట్టారు. గతేడాది మాదరిగానే నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
సుప్రీం తీర్పుతో టీచర్లకు తప్పనిసరి
ఇప్పటిదాకా కేవలం 2011 తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలనే నిబంధనతో టెట్ జీవో ఉంది. ప్రస్తుతం దాంట్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సవరణలు చేయాల్సి ఉంది. ఇన్ సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశాలనూ దాంట్లో పేర్కొనాల్సి ఉంది. ఈ సవరణ చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. దానిపై ఆ జీవో రాగానే.. వచ్చేనెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు.
వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశాన్నీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు వేర్వేరుగానే కొనసాగుతాయనీ, టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
క్వాలిఫై అయితేనే ప్రమోషన్లు!
ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లు టెట్ రాసేందుకు సమాయత్తం అవుతున్నారు. గతంలో ప్రమోషన్లకు కూడా అవసరమని హైకోర్టు ఆదేశించినా.. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, సుప్రీంకోర్టు ఆదేశంతో ఇక టెట్ పరీక్ష రాయాల్సిందేనని చాలామంది డిసైడ్ అయ్యారు. ఇన్ సర్వీస్ లో ఉన్న సుమారు 45వేల మంది రెండేండ్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంది. ప్రమోషన్ల కోసం పోటీ పడే వారిని కలుపుకుంటే 60వేల మంది వరకూ ఉంటారు. వారంతా ఈసారి టెట్ రాసే అవకాశం ఉంది.