న్యూఢిల్లీ: ప్రముఖ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పీటీ ఉష భర్త వి. శ్రీనివాసన్ (67) కన్నుమూశారు. శుక్రవారం (జనవరి 30) తెల్లవారుజూమున తిక్కోడి పెరుమాళ్పురంలోని వారి నివాసంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సమయంలో పీటీ ఉష ఇంట్లో లేరు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆమె ఢిల్లీ వెళ్లారు. విషయం తెలియగానే హుటాహుటిన ఆమె ఢిల్లీ నుంచి ఇంటికి బయలుదేరారు. శ్రీనివాసన్ మృతికి పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసన్ మృతికి ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు పీటీ ఉషకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పొన్నానిలోని కుట్టిక్కడ్‌లోని వెంగలి తరవాడ్‌కు చెందిన నారాయణన్, సరోజిని దంపతుల కుమారుడు శ్రీనివాసన్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లోడిప్యూటీ ఎస్పీ హోదాలో ఆయన రిటైర్డ్ అయ్యారు. 1991లో తన దూరపు బంధువైన పీటీ ఉషను శ్రీనివాసన్ వివాహం చేసుకున్నారు. వీరికి డాక్టర్ ఉజ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. పీటీ ఉషకు ఆమె అథ్లెటిక్ కెరీర్ అంతటా -శ్రీనివాసన్ అండగా నిలిచారు. ఆమె విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీ రోల్ ప్లే చేశారు.
