అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండో టర్మ్ బాధ్యతలు చేపట్టాక తన పాత దూకుడును మళ్లీ ప్రదర్శిస్తున్నారు. తాజాగా క్యూబాకు క్రూడ్ ఆయిల్ సప్లై చేసే దేశాలపై భారీ టారిఫ్ విధిస్తామంటూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంతర్జాతీయ సమాజంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. క్యూబాకు ఏ రూపంలో చమురు అమ్మినా లేదా సరఫరా చేసినా ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై అదనపు పన్నులు వేస్తానంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ నిర్ణయం ప్రధానంగా మెక్సికోను చేసుకుని తీసుకున్నదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా క్యూబాకు మెక్సికోనే ప్రధాన క్రూడ్ సప్లయర్ గా కొనసాగుతోంది.
ట్రంప్ తాజా హెచ్చరికల నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ వ్యూహాత్మకంగా స్పందించారు. క్యూబాకు క్రూడ్ ఆయిల్ రవాణాను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆమె ధృవీకరించారు. అయితే ఈ నిర్ణయం అమెరికా ఒత్తిడి వల్ల తీసుకున్నది కాదని, మెక్సికో సార్వభౌమత్వ అధికారంతో తీసుకున్న స్వతంత్ర నిర్ణయమని ఆమె చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు, కార్యకలాపాల పరంగా ఆయిల్ సప్లైలో హెచ్చుతగ్గులు సహజమని ఆమె చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెప్టెంబర్ 2025లో మెక్సికోలో పర్యటించినప్పటి నుంచి ఈ అంశంపై ఉత్కంఠ నెలకొంది.
వాస్తవానికి క్యూబా ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తన ఇంధన అవసరాల కోసం ఆ దేశం మెక్సికో, రష్యా, వెనిజులాపైనే ఆధారపడుతోంది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మెక్సికో ప్రభుత్వ రంగ సంస్థ 'పెమెక్స్' ప్రతిరోజూ దాదాపు 20వేల బారెళ్ల క్రూడ్ ఆయిల్ ను క్యూబాకు ఎగుమతి చేసింది. ఇప్పుడు ట్రంప్ నిబంధనల వల్ల ఈ సరఫరా నిలిచిపోతే క్యూబాలో చీకట్లు అలుముకునే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మెక్సికో ఒకవైపు హవానాతో దశాబ్దాల స్నేహాన్ని కాపాడుకుంటూనే.. మరోవైపు ట్రంప్ భౌగోళిక రాజకీయ ఎజెండాను తట్టుకోవాల్సిన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
అమెరికాతో సంబంధాల విషయంలో మెక్సికో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోంది. గత వారమే డజన్ల కొద్దీ డ్రగ్ కార్టెల్ సభ్యులను మెక్సికో ప్రభుత్వం అమెరికాకు అప్పగించింది. ఇది ట్రంప్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉన్నప్పటికీ.. తన దేశ నిర్ణయాలు ఎప్పుడూ స్వయంప్రతిపత్తితోనే ఉంటాయని క్లాడియా షీన్‌బామ్ నొక్కి చెబుతున్నారు. క్యూబాకు సంఘీభావం కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఆ మద్దతు ఏ రూపంలో ఉంటుందనేది ఆమె స్పష్టం చేయలేదు. ట్రంప్ తన టారిఫ్స్ అస్త్రంతో లాటిన్ దేశాలను ఎలా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటారో రానున్న కాలంలో వేచి చూడాల్సిందే.
