టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దర్యాప్తు.. ప్రమాదాలపై ఓనర్స్ సీరియస్..

టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లపై దర్యాప్తు.. ప్రమాదాలపై ఓనర్స్ సీరియస్..

అమెరికా రవాణా భద్రతా సంస్థ(NHTSA) టెస్లా సంస్థపై మరోసారి దృష్టి సారించింది. టెస్లా కార్లలోని సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్(FSD) పనితీరుపై పెరుగుతున్న ఆందోళనలు.. ఈ క్రమంలో జరిగిన పలు సంఘటనలపై నమోదైన ఫిర్యాదుల గురించి ప్రస్తుతం అధికారికంగా దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు వాటిని దాటి వెళ్లడం, తప్పు రహదారి వైపు వెళ్లడం, ఇతర వాహనాలకు ఢీకొనడం వంటి ఘటనలు గుర్తించబడ్డాయి. ఈ సమస్యల కారణంగా అనేక ప్రమాదాలు జరగటంతో పాటు ప్రయాణికులకు గాయాలైనట్లు కేసులు నమోదయ్యాయి. 

టెస్లా కార్లకు సంబంధించి మొత్తం 58 సంఘటనలను పరిశీలించనుంది NHTSA. ఈ ఘటనల్లో పన్నెండు కంటే ఎక్కువ ప్రమాదాల్లో దాదాపు 20 మంది గాయపడ్డారు. దర్యాప్తు ప్రస్తుతం అమెరికాలో ఉన్న మొత్తం 29 లక్షల టెస్లా వాహనాలపై కొనసాగనుంది. చాలా సార్లు టెస్లా కార్లు అకస్మాత్తుగా విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ ఎలాంటి హెచ్చరికలు రాలేదని డ్రైవర్లు చెబుతున్నారు. అధికంగా ఈ సమస్యలు రహదారుల్లో జంక్షన్ల వద్ద చోటుచేసుకున్నాయని వారు వెల్లడించారు. కొన్ని టెస్లా వాహనాలు ట్రైన్ సిగ్నల్స్ దగ్గర ఆగకపోవడం, గేట్లు మూసివేసినప్పటికీ ముందుకు కదిలి వెళ్లడం వంటి తీవ్రమైన లోపాల గురించి ఓనర్లలో ఆందోళనలు పెరిగాయి. ఈ అంశాన్ని కూడా విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.

ఏడాది ప్రారంభంలోనే NHTSA టెస్లా “సమ్మన్” టెక్నాలజీపై విచారణ చేపట్టింది. డ్రైవర్‌ను పికప్ చేసేందుకు కారును స్వయంచాలకంగా రావడానికి ఉద్దేశించిన ఈ ఫీచర్ పార్కింగ్ లాట్లలో చిన్నపాటి ప్రమాదాలకు కారణమైంది. అలాగే ఆగస్టులో మరో కేసులో టెస్లా ప్రమాదాలను సమయానికి నివేదించలేదని ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది. అదే నెలలో మియామీ జ్యూరీ 2019లో జరిగిన ప్రాణాంతక ప్రమాదానికి టెస్లా కంపెనీ కొంత బాధ్యత వహించాలని తీర్పు ఇచ్చి, బాధితులకు 240 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ALSO READ : ఐటీ రైడ్స్ తర్వాత అదానీ గుప్పిట్లోకి వచ్చేసిన కంపెనీల లిస్ట్ ఇదే..!

ప్రస్తుత పరిశీలనలో ఉన్న FSD సిస్టమ్ Level 2 డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ, అంటే డ్రైవర్ పూర్తి శ్రద్ధ రహదారిపై ఉంచాల్సిన అవసరముంది. కొత్త వెర్షన్ గత వారం విడుదల కాగా.. టెస్లా ఇప్పుడు డ్రైవర్ జోక్యం లేకుండా పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయగల అప్‌డేట్ వెర్షన్‌ను పరీక్షిస్తోంది. దీనిని పరీక్షించన తర్వాత వేగంగా ప్రపంచ వ్యాప్తంగా టెస్లా వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. అయితే టెస్లా కార్లలో కొనసాగుతున్న లోపాలను సరిచేయాలని.. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించకపోతే ఈ సాంకేతికత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందది నిపుణుల హెచ్చరిస్తున్నారు.