పాపం ట్రంప్..ఏడు యుద్ధాలు ఆపినా నోబెల్ రాలె!!

పాపం ట్రంప్..ఏడు యుద్ధాలు ఆపినా నోబెల్ రాలె!!
  • ప్రపంచ హాట్ టాపిక్ గా శాంతి బహుమతి
  • వెనిజులా మహిళకు అత్యున్నత  పురస్కారం
  • నోరు విప్పని అమెరికా అధ్యక్షుడు 

ఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నిరాశే మిగిలింది. ప్రపంచంలో శాంతి స్థాపనకు తాను ప్రయత్నం చేస్తున్నానని, తన వద్ద ఉన్న టారిఫ్స్ అనే ఆయుధంతో శాంతి నెలకొల్పుతున్నానని చెప్పుకుంటూ వస్తున్న ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ సారి   ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా ప్రతిపక్షనేత మరియా కొరీనా మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది. 2025 నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ మిస్‌ కావడం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  అణు శక్తులైన భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపానని,  ప్రపంచ వ్యాప్తంగా ఏడెనిమిది యుద్ధాలను ఆపేశానని కూడా ట్రంప్ చెప్పుకున్నారు. 

కోట్లాది మంది ప్రాణాలను కాపాడానని, తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందేనంటూ మంకు పట్టు పట్టారు.  పాకిస్తాన్ తోపాటు ఇజ్రాయెల్‌తోనూ తన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి సిఫారసు చేయించుకున్నారు. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేశారు.  ఈ  నెల 5 డెడ్ లైన్ పెట్టి మరీ.. అటు నెతన్యాహూ, ఇటు హమాస్‌ను తనదైన శైలిలో దారికి తెచ్చుకొని డీల్ కంప్లీట్ చేశారు. దేవుడి ఆశీర్వాదంతో శాంతిని తీసుకొచ్చాను అంటూ ట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో ఇక శాంతి వర్ధిల్లుతుందని చెప్పుకున్నారు. ఇదే తరుణంలో వైట్ హౌస్ సైతం ట్రంప్ పీస్ ప్రెసిడెంట్ అని పేర్కొనడం విశేషం.  

నామినేషన్ చేసింది వీళ్లే!

ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత జూన్ నెలలో డొనాల్డ్ ట్రంప్ పేరును పాకిస్తాన్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేసింది.  జులై లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ కూడా నోబెల్ శాంతి  పురస్కారానికి రికమండ్ చేశారు.థాయ్‌లాండ్-కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి చేసిన కృషికిగానూ.. కాంబోడియా ప్రధాని హన్ మానెట్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారు. ‘మీకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని అనుకుంటున్నారా?’ అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నంకు ‘అదంతా నాకు తెలీదు. కానీ మనం ఏడు యుద్ధాలు ఆపామని మార్కో రూబియో చెబుతున్నాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ముగింపుకొచ్చినట్టే. చరిత్రలో ఇన్ని యుద్ధాలు ఆపినవాళ్లు నాకు తెలిసి ఎవరూ లేరు. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడానికి కారణమేంటో వాళ్లు గుర్తించాలి’ అన్నారు.

►ALSO READ | ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు.. ఒకప్పుడు దేశానికి ప్రధాని..ఇప్పుడు మెక్రోసాఫ్ట్ అడ్వయిజర్

ఎందుకు రాలేదంటే..?

ట్రంప్ చెబుతున్న లిస్టులో ఉన్న వాటిలో ఈజిప్ట్-ఇథియోపియా మధ్య ఘర్షణల్లేవ్. ఇథియోపియా బ్లూ నైలు నదిపై నిర్మించిన డ్యామ్ విషయంలో ఈజిప్ట్‌తో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇక సెర్బియా-కొసోవో మధ్య ఉద్రిక్తతలు సాయుధ సంఘర్షణ దాకా వెళ్లనేలేదు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణలను ట్రంప్ ఆపారు. భారత్-పాక్ మధ్య సైనిక సంఘర్షణను తాను ఆపానని ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. కానీ భారత్ మాత్రం ట్రంప్ జోక్యాన్ని ఖండించింది. నోబెల్ శాంతి పురస్కార ప్రకటనకు కొద్ది గంటల ముందు ఆగమేఘాల మీద ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చగలిగారు. ఇదొక్కటి మాత్రం చేయగలిగారు. దీంతో ట్రంప్ స్టేట్ మెంట్లను కమిటీ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.