పత్తి దిగుబడి రాలేదని రైతు సూసైడ్‌‌...ఆసిఫాబాద్‌‌ జిల్లా వాంకిడిలో విషాదం

పత్తి దిగుబడి రాలేదని రైతు సూసైడ్‌‌...ఆసిఫాబాద్‌‌ జిల్లా వాంకిడిలో విషాదం

ఆసిఫాబాద్‌‌, వెలుగు : పత్తి దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వాంకిడికి చెందిన బుట్లె సుధాకర్‌‌ (34) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది తొమ్మిది ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. భారీ వర్షాల కారణంగా దిగుబడి సరిగా లేదు. దీంతో మనస్తాపానికి గురైన సుధాకర్‌‌ శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాంకిడి హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య సంగీత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌‌ తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్‌‌...

పర్వతగిరి (గీసుగొండ), వెలుగు : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ ఆటో డ్రైవర్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్‌‌ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్ల శివారు గోపాల్‌‌రెడ్డి నగర్‌‌లో జరిగింది. సీఐ విశ్వేశ్వర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఇప్ప నాగరాజు (23) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా ఆటో సరిగా నడవకపోవడంతో చేసిన ఆర్థిక ఇబ్బందులు మొదలై అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతుడి తండ్రి సుధాకర్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.