
సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట్ లో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మంగలి రుక్మేశ్(36) తనకున్న అర ఎకరంలో సాగు చేసుకుంటున్నాడు. గతేడాది అప్పు చేసి హార్వెస్టర్ కొన్నాడు.
పంట సాగుతో పాటు వరికోత మెషీన్కోసం చేసిన అప్పులు రూ.24 లక్షల వరకు చేరాయి. సగం భూమి అమ్మి రూ. 12 లక్షలు అప్పు కట్టాడు. మిగతా అప్పు ఎలా తీర్చాలని బాధపడుతుండేవాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు.
స్థానికులు కుటుంబసభ్యలకు సమాచారం ఇచ్చి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ రుక్మేశ్ ఆదివారం చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉంది. భార్య కావేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.