
పెనుబల్లి, వెలుగు: పొలంలో పాముకాటు వేయడంతో రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పెనుబల్లి మండలం చిన్యా తండాకు చెందిన రైతు మాలోత్ దేవిజ (47) , ఆదివారం ఉదయం తన పొలం చూసేందుకు వెళ్లి గట్టు మీద నడుస్తుండగా ఏదో కుట్టినట్లు అనిపించినా పట్టించుకోలేదు.
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత కండ్లు తిరిగి, దాంతో వాంతులు చేసుకున్నాడు. పొలం వద్ద నడుస్తుండగా కాలుకి ఏదో కుట్టిందని కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే కల్లూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు బాధిత కుటుంబం తెలిపింది. రైతు మృతితో తండాలో విషాదం నెలకొంది.