వరి వద్దంటే కూరగాయలేసిన.. సబ్సిడీ పైసలెందుకిస్తలేరు?

వరి వద్దంటే కూరగాయలేసిన.. సబ్సిడీ పైసలెందుకిస్తలేరు?
  • ప్రజావాణిలో గడ్డి మందు తాగబోయిన రైతు
  • అధికారులు    తిప్పించుకుంటున్నారని నిరసన 
  • చెక్కు ఇప్పిస్తానని అడిషనల్​ కలెక్టర్ హామీ​
  • సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘటన 

సిరిసిల్ల టౌన్ వెలుగు : పంట సబ్సిడీ ఇవ్వలేదని సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఓ రైతు గడ్డి మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు. బాధితుడి కథనం ప్రకారం..ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన మెంట్ల లింగారెడ్డి వరి వేస్తే ఉరే అని గతంలో సీఎం కేసీఆర్ చెప్పడంతో ఉన్న ఎకరం భూమిలో కూరగాయాలు సాగు చేశాడు. అధికారులు సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, సబ్సిడీ డబ్బులు రూ.4 లక్షల చెక్కు వచ్చి 3 నెలలు గడుస్తున్నా అధికారులు ఇవ్వడం లేదు.

దీంతో సోమవారం గడ్డి మందు డబ్బాను జేబులో పెట్టుకుని ప్రజావాణికి వచ్చాడు. ఆర్డీవో, ఇతర అధికారుల ముందు డబ్బా బయటకు తీసి తాగబోతుండడంతో ఓ హోంగార్డు వచ్చి అడ్డుకుని లాక్కున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్​కలెక్టర్ ఖీమ్యా నాయక్ అక్కడికి వచ్చి అతడకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. తర్వాత పోలీసులు లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత  కౌన్సెలింగ్​ ఇచ్చి వదిలేశారు.