రైలు కింద పడి రైతు ఆత్మహత్య.. అప్పులు తీర్చే మార్గం లేక సూసైడ్

రైలు కింద పడి  రైతు ఆత్మహత్య.. అప్పులు తీర్చే మార్గం లేక సూసైడ్

జమ్మికుంట, వెలుగు: మూడేండ్లుగా పంట దిగుబడి సరిగా రాక, అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర ఆందోళనకు గురైన ఓ రైతన్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన పంజాల అశోక్(45)కు ఎకరం పొలం ఉంది. తన పొలంతో పాటు మూడేండ్లుగా మరో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నాడు. గత ఏప్రిల్​లో కురిసిన అకాల వర్షాలప్పుడు కూడా పం ట దెబ్బతిని దిగుబడి రాలేదు. 

ఏటా దిగుబడి అంతంతే రావడం, పండిన పంటకు మంచి ధర కూడా రాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. కౌలు, విత్తనాలు, పురుగుమందులు, కుటుం బ పోషణ కోసం మూడేండ్లలో చేసిన అప్పు రూ.6 లక్షలకు చేరింది. ఈ సారైనా పత్తి పంట చేతికొస్తుందని ఇటీవల విత్తనాలు కొనుగోలు చేసి వేశాడు. కానీ సకాలంలో వానలు పడక మొలకలు రాలేదు. వాతావరణం అనుకూలించే పరిస్థితి లేదని అశోక్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. శుక్రవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.