ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళనలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళనలు

చొప్పదండి/తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌/ ముస్తాబాద్‌‌‌‌/ జమ్మికుంట/ రాయికల్‌‌‌‌/మంథని,  వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు మండలకేంద్రాల్లో యూరియా రైతులు సోమవారం బారులుదీరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి సొసైటీకి 1120 బస్తాల యూరియా రాగా రైతులు ఉదయం నుంచే బారులుదీరారు. నాలుగెకరాల వరకు ఒక్క యూరియా బస్తా ఇస్తున్నారని, అది ఎలా సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపూర్ మండలం పొరండ్ల సొసైటీకి 170 యూరియా బస్తాలు రాగా..  సోమవారం ఉదయం నుంచి వర్షం పడుతున్నా గొడుగులు పట్టుకొని క్యూలైన్‌‌‌‌లో నిలబడ్డారు. నుస్తులాపూర్​ సొసైటీకి ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతులు చెప్పులను లైన్లో పెట్టారు. ఉదయం పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. జమ్మికుంట, ధర్మారం సొసైటీ ఎదుట రైతులు బారులుదీరారు.

 సైదాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం వెన్నంపల్లిలో సొసైటీ ఎదుట చెప్పులు లైన్‌‌‌‌లో పెట్టారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌‌‌‌ మండలకేంద్రంలో యూరియా కోసం సిద్దిపేట– కామారెడ్డి రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగారు. వేములవాడ పట్టణంలో యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. క్యూలైన్లలో నిలబడ్డా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. రాయికల్‌‌‌‌ మండలం భూపతిపూర్‌‌‌‌‌‌‌‌ సొసైటీలో యూరియా ఉన్న ఇవ్వడం లేదని ఒడ్డెలింగపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామ రైతులు ఆందోళన చేశారు. మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు.