
- 40 కిలోల బస్తాకు 43 కిలోల వడ్లు కాంటా వేస్తున్నారని ఫైర్
- నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్లో ఘటన
- అధికారుల చొరవతో ఆందోళన విరమణ
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు 40 కిలోల బస్తాకు 43 కిలోలు కాంటా వేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. సెంటర్ కు వచ్చిన ఖానాపూర్ పీఏసీఎస్ సీఈవో భూమి ఆశన్నతో పాటు సెంటర్ నిర్వాహకుడు సాయికుమార్ ను మంగళవారం గవర్నమెంట్ స్కూల్ రూమ్లో నిర్బంధించారు. సెంటర్ నిర్వాహకులు, అధికారులు మిల్లర్లతో మిలాఖాత్ అయ్యి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదనంగా 3 కిలోల వడ్లను ఎందుకు కాంటా వేస్తున్నారని నిలదీస్తే నిర్వాహకులు, అధికారులు సమాధానం ఇవ్వడం లేదన్నారు. విషయం తెలుసుకొని నిర్మల్ డీసీవో పాపారావు, పోలీసులు ఎర్వ చింతల్ కు చేరుకొని రైతులతో మాట్లాడారు. సెంటర్ లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఎక్కువ వడ్లు కాంటా వేయకుండా చర్యలు తీసుకుంటామని డీసీవో హామీ ఇచ్చారు. ఖానాపూర్ సీఈవో భూమి ఆశన్నకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు.