
భైంసా, వెలుగు: ఈ యేడు వానలు సరిగా లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు నీరందక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా బాసరలో రైతులు, మత్స్యకారులు కలిసి వర్షం కోసం ప్రత్యేక పూజలు చేశారు.
గోదావరికి వెళ్లి బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. డప్పువాయిద్యాల మధ్య ఆలయాలకు వెళ్లి దేవతామూర్తులకు పూజలు చేశారు. మత్స్యకారులు తమ సంప్రదాయ పద్ధతిలో చేపలు పట్టే వలతో శోభాయాత్రగా వెళ్లి గోదావరి నది నీటిని తెచ్చి పూజలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ బాసర పరిసర ప్రాంతంలో వర్షాలు లేక పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.