మరో బైపాస్ నిర్మిస్తే భారీగా నష్టపోతాం : రామయంపేట రైతులు

మరో బైపాస్ నిర్మిస్తే భారీగా నష్టపోతాం : రామయంపేట రైతులు

మెదక్, రామాయంపేట, వెలుగు: మెదక్​ జిల్లా కేంద్రం నుంచి రామాయంపేట మీదుగా మరో బైపాస్ రోడ్డు వద్దంటూ రైతులు, వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. రామాయంపేటలో  బైపాస్​తో రూ.కోట్ల విలువైన భూములు కోల్పోయి రోడ్డున పడతామని రైతులు, ఊరి అవతలి నుంచి రోడ్డు వేయడం వల్ల తమ బిజినెస్​ దెబ్బతింటాయని వ్యాపారులు చెబుతున్నారు. 

మెదక్​ నుంచి సిద్దిపేటకు హైవే..

మెదక్ టౌన్​ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు కొత్తగా నేషనల్ హైవే మంజూరైంది. 69 కిలోమీటర్ల దూరం హైవే నిర్మాణానికి రూ.882 కోట్లు మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణానికి ఇటీవల ప్రధాని మోడీ వర్చువల్​గా శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా రామాయంపేట టౌన్​ వద్ద బైపాస్ రోడ్డు నిర్మించనున్నారు. ఇందుకు 35 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్–నాగ్​పూర్​ హైవే విస్తరణకు పెద్ద ఎత్తున భూములు కోల్పోయామని, మళ్లీ ఇప్పుడు మరో హైవేకు భూములు తీసుకుంటే తమ బతుకులు ఆగమవుతాయని రైతులు వాపోతున్నారు. రోడ్డు నిర్మాణంలో రూ.లక్షలు పెట్టి కొన్న కొందరి ఇండ్ల ప్లాట్​లు కూడా పోనుండడంతో వారిలో ఆందోళన నెలకొంది. మరోవైపు  హైదరాబాద్– నాగపూర్​ హైవే  నిర్మాణ టైంలో బైపాస్ రోడ్డు వేయడంతో చాలా వాహనాలు ఆర్టీసీ బస్సులు టౌన్​ బయట నుంచే వెళ్లిపోతుండటంతో తమ బిజినెస్​ దెబ్బతిన్నదని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు మరో బైపాస్ నిర్మిస్తే మెదక్-–సిద్దిపేట రూట్​లో తిరిగే వాహనాలు కూడా టౌన్ బయటి నుంచే వెళ్తాయని, అప్పుడు తాము పూర్తిగా నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త హైవే టౌన్ మధ్యలో నుంచే వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అటు రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఉండదు. ఇటు వ్యాపారాలకు నష్టం ఉండదంటున్నారు. 

బైపాస్ రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు

రామాయంపేట, వెలుగు: రామాయంపేటలో బైపాస్ రోడ్డు సర్వే పనులను రైతులు సోమవారం అడ్డుకున్నారు. సర్వే కోసం హైవే సిబ్బంది రామాయంపేటకు చేరుకోవడంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. ఈ రోడ్డుతో  విలువైన భూములను కోల్పోతుండటంతోపాటు టౌన్ ​అభివృద్ధి ఆగిపోతుందన్నారు. అందువల్ల పాత  సిద్దిపేట రోడ్డునే హైవేగా విస్తరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి  వినతి పత్రం అందజేశారు.

బిజినెస్​ లు మరింత దెబ్బతింటయి  

గతంలో హైదరాబాద్–- నాగపూర్​ హైవే రామాయంపేట టౌన్​ మధ్యలో నుంచి ఉండేది. అన్ని వెహికిల్స్​ ఈ రూట్లోనే నడిచేవి. ఆ హైవే విస్తరించినపుడు బైపాస్​ రోడ్డు నిర్మించారు. అప్పటి నుంచి బిజినెస్​లు తగ్గిపోయాయి. ఇపుడు మరో బైపాస్​ నిర్మిస్తే మా బిజినెస్​లు మరింత దెబ్బతింటాయి. అందుకని కొత్త హైవే టౌన్​ లో నుంచి వేస్తేనే మంచిగుంటది. 
- నాగరాజు, వ్యాపారి, రామాయంపేట

రూ.9 కోట్లు నష్టపోతం

మాకు 5 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి బైపాస్ రోడ్డు పోతుందని అంటున్రు. దాదాపు 3 ఎకరాల  భూమి పోయేటట్టుంది. ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం ఎకరం రూ.3 కోట్ల దాకా పలుకుతోంది. మా భూమి పోతే రూ.9 కోట్ల ఆస్తిని కోల్పోతాం. మరి ఉన్నది పోతే మేము ఎలా బతకాలి. మాలాగా చాలా మంది నష్టపోతరు. అందుకని టౌన్​ లోని పాత రోడ్డునే  హైవేగా విస్తరించేటట్లు అలైన్ మెంట్ మార్చాలి.
- దోమకొండ యాదగిరి, రైతు, రామాయంపేట