ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసలు వానలే లేవు !

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసలు వానలే లేవు !
  • ఎండుతున్న పత్తి చేలను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు
  • ఆయకట్టు మండలాలకు ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల
  • ఆయకట్టు లేని మండలాల్లో రైతులకు కష్టాలు 

ఖమ్మం/ కారేపల్లి, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు రైతులను ఊరించి ఉసూరుమనిపించాయి. వానాకాలం సీజన్​ ప్రారంభమై 45 రోజులు దాటుతున్నా, సరైన వానలు కురవకపోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. మే నెల రెండో వారంలో కురిసిన వర్షాలతో అన్నదాతలు సంతోషపడ్డారు. కొందరు పత్తి విత్తనాలు నాటుకోగా, మరికొందరు వరి నారుమడులు దున్నుకున్నారు. ఇంకొందరు నేరుగా వడ్లు చల్లుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా వర్షాలు తప్ప వానలు జోరందుకోవడం లేదు. 

దీంతో ఈ సీజన్​ లో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో సగం మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. వెదజల్లుడు పద్ధతిలో వేసిన వరి పొలాలతో పాటు, నారుమడులు, పత్తి మొక్కలు ఎండే పరిస్థితి వచ్చింది. వాటిని కాపాడుకునేందుకు అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. బావి, బోర్లున్న రైతులు నీటి తడులు కట్టుకుంటుండగా, పూర్తిగా వర్షాధారంపైనే పంటలు వేసిన రైతులు మాత్రం చినుకు పడకపోతుందా అని ఆశగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. 

సగం మండలాల్లో లోటు వర్షపాతమే.. 

ఖమ్మం జిల్లాలో ఈ సీజన్​ లో సగం మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. సగటు వర్షపాతం 239.8  మిల్లీమీటర్లు కాగా, మంగళవారం వరకు 194 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా యావరేజీగా 19 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, మొత్తం 21 మండలాలకు గాను 10 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే చింతకాని మండలంలో 48 శాతం తక్కువగా, కూసుమంచిలో 45, ఎర్రుపాలెంలో 34 శాతం తక్కువ వర్షాలుపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. 

303 మిల్లీ మీటర్ల వర్షానికి గాను 270 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 23 మండలాలకు గాను 11 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నాలుగు మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడగా, మిగిలిన 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పినపాకలో 46.8 శాతం, కరకగూడెంలో 46.5 శాతం, దుమ్ముగూడెంలో 42.7, మణుగూరులో 34.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 

కాపాడుకునే ప్రయత్నం.. 

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నారుమడులు ఎండిపోతున్న విషయాన్ని బాధిత రైతులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నాలుగు రోజుల కింద సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని విడుదల చేశారు. రెండ్రోజుల కింద పాలేరు రిజర్వాయర్​ నుంచి సాగర్​ నీటిని విడుదల చేశారు. నాలుగైదు రోజుల్లో ఆయకట్టు మండలాల పరిధిలో ఈ ప్రాజెక్టుల ద్వారా విడుదల చేసిన నీరు పంటలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఆయకట్టు లేని మండలాల్లో మాత్రం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉండడంతో వానలు ముమ్మరంగా కురిస్తే తప్ప పంటలను దక్కించుకునే పరిస్థితి
 కనిపించడం లేదు.

పత్తి మొక్కలు వాడిపోతున్నాయి.. 

సరైన వర్షాలు లేక మొలిచిన పత్తి మొక్కలు వాడిపోతున్నాయి.. ఈసారి11 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. మొదట వేసిన విత్తనాలు మొలవకపోవడంతో రెండోసారి వేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. వ్యవసాయ బావిలో ఉన్న నీరు ఎకరానికి కూడా సరిపోవడం లేదు. వాన వస్తేనే పెట్టిన పెట్టుబడులైనా వస్తాయని ఆశ పడుతున్నాను.

పేరెన్ని వెంకటేశ్వర్లు, రైతు, కారేపల్లి