పరిహారం తేల్చకపోవడంపై బాధిత రైతుల అభ్యంతరం 

    పరిహారం తేల్చకపోవడంపై బాధిత రైతుల అభ్యంతరం 

ఖమ్మం, వెలుగు: మహారాష్ట్రలోని నాగ్​పూర్​ నుంచి ఏపీలోని అమరావతి వరకు నిర్మిస్తున్న గ్రీన్​ ఫీల్డ్ హైవే అలైన్​మెంట్ మార్చాలని ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్​ మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులు దాదాపు మూడేళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. సర్వే జరగనీయకుండా అడ్డుకుంటూ, ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల్లోనూ తమ అభిప్రాయాలను, నిరసనలను అధికారులకు చెప్పుకున్నారు. చాలాసార్లు గ్రీవెన్స్​లో కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్​కు వినతిపత్రాలు ఇచ్చారు. ఇటీవల ఖమ్మం వచ్చిన కేంద్ర సహకార, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సహాయ మంత్రి బీఎల్ వర్మకు తమ సమస్యను వివరించారు. ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలోని భూములను సేకరించడాన్ని,  కొత్త కలెక్టరేట్  సమీపంలోని భూములకు పరిహారం విషయంలో ఆఫీసర్లు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతున్నారు. కొన్ని గ్రామాల్లో భూసేకరణ అవసరం లేకుండా ప్రత్యామ్నాయాలను అధికారులకు  సూచిస్తున్నారు. రైతుల ఆందోళనలతో గతంలో భూసేకరణ కోసం అధికారులు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్​ రద్దు కాగా, ప్రస్తుతం రెండోసారి ఇచ్చిన గెజిట్​ నోటిఫికేషన్​ అమలు​లో ఉంది. 

210 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్

నాగ్ పూర్–అమరావతి హైవేలో భాగంగా ఖమ్మం జిల్లాలో 90 కిలోమీటర్ల మేర గ్రీన్​ ఫీల్డ్ హైవే నిర్మించాల్సి ఉంది. దీని కోసం తీర్థాల, కామంచికల్, దారేడు, రేగులచెలక, రఘునాథపాలెం, మల్లెమడుగు, బల్లేపల్లి, వి.వెంకటాయపాలెం రెవెన్యూ గ్రామాల మీదుగా సుమారు 210 ఎకరాలు సేకరించేందుకు గెజిట్ నోటిఫికేషన్​ రిలీజ్​ చేశారు. ఇందులో ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలోని బల్లేపల్లి, మల్లెమడుగు గ్రామాల్లో 20 ఎకరాలు సేకరించాల్సి వస్తోంది. దీనిపైనే బాధిత రైతులు మూడేళ్లుగా అభ్యంతరాలు చెబుతున్నారు. ఖమ్మం పట్టణానికి అతి సమీపం నుంచి రోడ్డు పోతుండడం, కార్పొరేషన్​ పరిధిలోని భూములను కోల్పోవాల్సి వస్తుండడం, పరిహారం విషయం తేల్చకుండానే భూములను సర్వే చేస్తుండడంతో రైతులు అడ్డుకున్నారు. మరోవైపు కొత్త కలెక్టరేట్ కు వెంకటాయపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.కోటి చొప్పున ఇచ్చి పాతిక ఎకరాలు కొనుగోలు చేయగా, దానికి 100 మీటర్ల దూరం నుంచే పోతున్న హైవే కోసం మాత్రం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఇస్తామనడంతో భూములు కోల్పోతున్న రైతులు మండిపడుతున్నారు. మార్కెట్ వ్యాల్యూ ఎకరాకు రూ.3 కోట్ల వరకు ఉండగా, అందులో కేవలం పది శాతం మాత్రమే చెల్లిస్తామనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గ్రీన్​ ఫీల్డ్ హైవే ప్రతిపాదించిన భూముల్లో దాదాపు 890 ప్లాట్లు కూడా పోతున్నాయని బాధితులు చెబుతున్నారు. గతంలో చేసిన ఈ లే అవుట్లకు డీటీసీపీ అనుమతులు లేకపోవడం వల్ల వాటికి కూడా ఎకరాల్లో పరిహారం వచ్చే అవకాశం ఉండడంతో ప్లాట్ల యజమానులు నష్టపోతారని చెబుతున్నారు. 

ప్రత్యామ్నాయం చూపిస్తున్రు..

ఇక తక్కువ భూసేకరణతో గ్రీన్​ ఫీల్డ్ హైవే పూర్తయ్యేలా రైతులు ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం మీదుగా కురవి నుంచి కోదాడ వెళ్లే హైవే కోసం కాచిరాజుగూడెం, దారేడు మీదుగా భూ సేకరణ పూర్తయి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డుకు కురవి దగ్గర అమరావతి, నాగ్​పూర్​ హైవే కనెక్ట్ చేస్తున్నారు. దాన్ని గ్రీన్​ ఫీల్డ్ హైవేతో దారేడు, కాచిరాజుగూడెం దగ్గర కనెక్ట్ చేస్తే అదనంగా భూ సేకరణ చేయాల్సిన అవసరం లేకుండానే నిర్మాణం పూర్తి చేయవచ్చని సూచిస్తున్నారు. దీంతో నాగ్​ పూర్–అమరావతి హైవేకి 17 కిలోమీటర్ల మేర దూరం పెరుగుతుందే తప్ప భూసేకరణ ఖర్చు, రైతులు నష్టపోయే భూమి మిగులుతుందని బాధిత రైతులు చెబుతున్నారు. ఇటీవల కేంద్రమంత్రి బీఎల్ వర్మ ఖమ్మం వచ్చిన సమయంలోనూ ఈ అలైన్ మెంట్ మార్పు గురించిన వివరాలతో వినతిపత్రం అందజేశారు. దీనిపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. రైతులు ఇచ్చిన అలైన్​మెంట్ మార్పు ప్రతిపాదన లేఖను నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లకు పంపించినట్లు అడిషనల్​ కలెక్టర్​మధుసూదన్​రావు తెలిపారు. 

రైతులకు మేలు జరిగేలా అలైన్ మెంట్ మార్చాలి

బహిరంగ మార్కెట్​లో కోట్లు పలుకుతున్న భూములను రోడ్డు కోసం ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోంది. రైతులు మూడు పంటలు పండించుకునే భూములను వదిలిపెట్టి, అలైన్​మెంట్ మార్పు ద్వారా తక్కువ భూసేకరణతో రోడ్డు పూర్తి చేయవచ్చు. దీనిపై మూడేళ్లుగా పోరాటం చేస్తున్నాం. మిగిలిన రైతులకు కూడా మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి.
‌‌–సంగబత్తుల నవీన్, గ్రీన్​ ఫీల్డ్  పోరాట రైతుల జేఏసీ గౌరవాధ్యక్షుడు