- ఈసారి 32,640 ఎకరాల్లోనే సన్నాల సాగు
- గత సీజన్ లో సెంటర్లకు 4657 టన్నులు సన్నాలే
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు కేవలం 13 శాతమే సన్న రకాలను సాగు చేశారు. ప్రస్తుతం కోతలు ప్రారంభమై కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా..సన్న రకం వడ్లు ఆఫీసర్లు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం కన్పించడం లేదు.
దొడ్డు రకమే ఎక్కువ..
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం అందిస్తోంది. దీంతో సన్న రకాలు పడించాలని రైతులకు సర్కారు సూచించింది. పైగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సన్న రకాలను పండిస్తే క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామంతో జిల్లాలో సన్న రకాల సాగు పెరుగుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు సహా అందరూ భావించారు.యాదాద్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,82.890 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2,50,250 ఎకరాల్లో దొడ్డు రకం సాగు, అందులో కేవలం 32,640 వేల ఎకరాల్లోనే సన్న రకం సాగు చేస్తున్నారని తేలింది.
దిగుబడి తగ్గడానికి కారణాలివే..
సన్న రకాల సాగుకు పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడి తక్కువ వస్తుంది. పైగా సన్న రకాలను చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయి. పురుగుల మందు వాడకం ఎక్కువ కావడంతో ఎకరానికి రూ. 5 వేల వరకూ పెట్టుబడి ఎక్కువ అవుతోందని రైతులు చెబుతున్నారు. దొడ్డు రకం ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంటే.. అదే సన్నాలు ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల మధ్య దిగుబడి వస్తోంది. ఓవరాల్‌గా ఐదు నుంచి ఏడు క్వింటాళ్లకు పైగా దిగుబడి తగ్గుతోంది. దీంతో రైతులు సన్న వడ్ల సాగును తగ్గించుకొని దొడ్డు రకాలనే ఎక్కువగా పండిస్తున్నారు.
గడిచిన సీజన్ లో సెంటర్లకు 4657 టన్నులు సన్నాలే
కొందరు రైతులు తమ తిండి అవసరాలకు కోసమే సన్న వడ్లను పండిస్తుంటే.. మరికొందరూ అసలే పండించడం లేదు. ప్రస్తుతం పండించిన 32 వేల ఎకరాల్లో సుమారుగా 70 వేల టన్నుల వడ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది రైతులు తమ తిండి అవసరాల కోసం మరాడించుకొని దాచుకుంటారు. నవంబర్ మొదటి వారంలో ప్రారంభించే రైతుల అవసరాలకు పోనూ ఈసారి కనీసం 20 వేల టన్నులు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు. అయితే 2024 వానాకాలం సీజన్లో 34,847 ఎకరాల్లో సన్న రకం సాగు చేయగా కొనుగోలు సెంటర్లకు కేవలం 4657 టన్నుల సన్నాలే వచ్చాయి. కాగా యాసంగి 2025 సీజన్ లో కేవలం 1291 టన్నుల సన్న వడ్లు మాత్రమే కొనుగోలు సెంటర్లలో రైతులు అమ్ముకున్నారు.
సీజన్ల వారీగా వానాకాలం సాగు
సీజన్ మొత్తంసాగు దొడ్డురకం సన్నాలు
2020 1,96,950 1,10,000 86,500
2021 2,80,000 2,26,000 54,000
2022 3,00,156 2,79,922 20,234
2023 3,05,126 2,92,988 12,338
2024 2,76,104 2,41,287 34,817
2025 2,82.890 2,50,250 32,640
