కొనుగోలు కేంద్రాల్లో  టార్పాలిన్లు లేవ్!.. కిరాయికి తెచ్చుకుంటూ రైతుల తిప్పలు 

కొనుగోలు కేంద్రాల్లో  టార్పాలిన్లు లేవ్!.. కిరాయికి తెచ్చుకుంటూ రైతుల తిప్పలు 

కామారెడ్డి , వెలుగు:  జిల్లాలో  వడ్ల కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సెంటర్​కు టార్పాలిన్లు సప్లై చేశామని  ఆఫీసర్లు  చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంది. వడ్ల కుప్పలపై కప్పేందుకు రైతులే  కిరాయికి తెచ్చుకుంటున్నారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చినప్పటి నుంచి కాంటా పెట్టి లోడింగ్​అయ్యే వరకు ఒక్కో రైతు  కవర్లకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు కిరాయి చెల్లిస్తున్నారు. వడగండ్ల వానలు  జిల్లా రైతులను అగం చేస్తున్నాయి. టార్పాలిన్లు లేక ఇటీవల జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు సెంటర్లలో ఆరబోసిన వడ్లు చాలా చోట్ల తడిసిపోగా, కొన్ని చోట్ల వరదల్లో కొట్టుకుపోయాయి.  
 
ఆఫీసర్ల నిర్లక్ష్యం..

జిల్లాలో యాసంగి సీజన్​లో  5 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందన్న అంచనాతో అధికారులు  346 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 204 సెంటర్లు ప్రారంభించగా ఇందులో 109 చోట్ల కాంటాలు అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో  మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నప్పటికీ  ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. టార్పాలిన్లు, కాంటాలు మార్కెటింగ్​శాఖ, గన్నీ బ్యాగ్స్​సివిల్​సప్లై శాఖ సప్లై చేయనుండగా, ఇతర వసతులు సెంటర్ల నిర్వాహకులు చూసుకోవాలి. జిల్లాలో 2 వేలకు మించి  టార్పాలిన్లు లేవ్.  ప్రతి సెంటర్​కు  20  వరకు సప్లై చేసినట్లు  ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ  కొన్ని  సెంటర్లలో టార్పాలిన్లే ఇవ్వలేదని నిర్వాహకులు చెప్తున్నారు. కొన్ని చోట్ల  5 నుంచి 10 మాత్రమే  ఇచ్చారంటున్నారు. దీంతో చాలా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు కిరాయికి తెచ్చుకుంటూ, లేదా కవర్లను కప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. 

 కిరాయికి తెచ్చుకుంటున్న రైతులు

సెంటర్ల వద్ద  వడ్లు ఆరబోసేందుకు, కుప్పలపై కప్పేందుకు  కవర్లను రైతులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర  కిరాయికి తెచ్చుకుంటున్నారు.  ఇలా వడ్ల దిగుబడి లెక్కన ఒక్కో రైతు  10 నుంచి   30 కవర్లు  కవర్లు తెచ్చుకుంటున్నారు. ఒక కవర్​కు రోజుకు రూ.10 చొప్పున కిరాయి ఇవ్వాలి.  కాంటా అయ్యే వరకు  వారం నుంచి  15 రోజులు పడుతోంది.  ఒక రైతు  15 కవర్లు తీసుకుంటే రోజుకు రూ.150 అవుతోంది. ఈ లెక్కన కాంటా పెట్టే వరకు ఒక్కో  రైతుకు కవర్ల  కిరాయి రూ.1,500 నుంచి రూ.3వేల వరకు అవుతోంది.  కవర్లు కిరాయికి ఇచ్చేందుకు జిల్లాకు  ఏపీ నుంచి చాలా మంది వ్యాపారులు వచ్చారు.   వడ్ల కొనుగోళ్లతో  ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని, వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్​చేస్తున్నారు. 

15  కవర్లు కిరాయికి తెచ్చుకున్నా

వడ్లు తెచ్చి సెంటర్లో ఆరబోసిన. రాళ్ల వానలు ఎప్పుడు పడ్తయో అర్థమైతలే. వడ్లపై కప్పేందుకు టార్పాలిన్లు లేక 15 కవర్లు కిరాయికి  తెచ్చిన.  కవర్ల కిరాయి రోజుకు రూ. 150 అవుతోంది. వారం రోజులాయే ఇంకా కాంట పెడ్తలే.  కాంట పెట్టే వరకు వరకు కిరాయి కట్టాలె. 
- చంద్రయ్య, షెట్పల్లి సంగారెడ్డి

ఎప్పుడూ ఇదే పరిస్థితి

 ప్రతి సీజన్లో  సెంటర్లలో టార్పాలిన్లు  ఉండవు. మేమే  కవర్లు కిరాయికి తెచ్చుకోవాలి. వడ్లు కాంటాలు పెట్టడంలో నిర్వాహకులు బాగా ఆలస్యం చేస్తున్నారు.  ఒక్కోసారి 15 నుంచి  20 రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోంది. దీంతో కవర్ల కిరాయిలు పెరుగుతున్నాయి.
- రాజయ్య, లింగంపేట

సెంటర్లకు పంపిణీ చేశాం

ప్రతి సెంటర్​కు టార్పాలిన్లు సప్లై  చేశాం.  కాంటాలు పెట్టిన తర్వాత నిర్వాహకులు బస్తాలపై కప్పుతున్నారు.   అవసరమైన రైతులకు కూడా  ఇస్తున్నాం.  ఎక్కువ రైతులు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతోంది. 
- అభిషేక్​,  సివిల్ సప్లై డీఎం