రూ. 2658 కోట్లు పెండింగ్​.. వడ్ల పైసల కోసం ఉమ్మడి జిల్లా రైతుల ఎదురుచూపు

రూ. 2658 కోట్లు పెండింగ్​.. వడ్ల పైసల కోసం ఉమ్మడి జిల్లా రైతుల ఎదురుచూపు

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  కొనుగోలు సెంటర్లలో అమ్మిన వడ్లు పైసల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇంకా దాదాపు రూ.2658కోట్లు రైతుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఓ వైపు పంట సీజన్‌ను ప్రభుత్వం ముందుకు జరపాలని ప్రతిపాదించింది. దీంతో రైతులు సాగుకు రెడీ అవుతుండగా వడ్ల పైసలు రాకపోవడంతో పెట్టుబడులు ఎలా అని రైతులు టెన్షన్​ పడుతున్నారు. వడ్లు అమ్మేందుకు దాదాపు రెండు నెలలు కొనుగోలు సెంటర్ల చుట్టూ తిరిగిన రైతులు... ఇప్పుడు పైసల కోసం అగ్రికల్చర్​ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అకాల వర్షాలతో ఇప్పటికే దిగుబడులు తగ్గిపోగా.. కొనుగోలు సెంటర్లలోనూ అవస్థలు పడ్డారు. ఇప్పుడు వడ్ల పైసల కోసం వారికి కష్టాలు తప్పడం లేదు. 

డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

ఉమ్మడి  కరీంగనర్  జిల్లాలో  దాదాపు కొనుగోళ్లు పూర్తయ్యాయి. వడ్ల డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2658 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా రైతులకు రూ.300 కోట్లు, జగిత్యాల రైతులకు రూ.350 కోట్లు,పెద్దపల్లి రైతులకు రూ.260 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.280 కోట్లు పెండింగ్​ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం రూ.1890 కోట్లు వడ్ల పైసలు జమ చేసినట్లు సివిల్​సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్​తెలిపారు. అయితే ఈ పైసలు ఇంకా రైతుల అకౌంట్‌లో జమ కాలేదు. సోమవారం జమ అయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

తాజాగా రిలీజ్​అయిన డబ్బులో కరీంనగర్​జిల్లాలో 59,186 మంది రైతులకు సంబంధించి 3 లక్షల మెట్రిక్​టన్నుల వడ్లకు రూ.510 కోట్లు, జగిత్యాలలో 41.4లక్షల మెట్రిక్​టన్నుల వడ్లకు రూ.600 కోట్లు, రాజన్నజిల్లాలో 53వేల మంది రైతుల నుంచి కొన్న 2.45 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు రూ.330 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 47వేల మంది రైతుల నుంచి 3.39లక్షల మెట్రిక్ టన్నులకు రూ.450 కోట్లు రిలీజ్ చేసింది. 

పెట్టుబడులకు రైతుల్లో టెన్షన్​

మృగశిర కార్తె ప్రవేశంతో వానాకాలం సీజన్​స్టార్ట్​అయినట్లే. నారు పోసిన దగ్గరి నుంచి నాటు వేసేవరకు ఎకరాకు కనీసం రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈక్రమంలో వడ్లు అమ్మిన పైసలు రాక రైతులు టెన్షన్​పడుతున్నారు. యాసంగి వరి కోసేందుకు హార్వెస్టర్లు, కొనుగోలు సెంటర్లకు తరలించేందుకు ట్రాక్టర్​కిరాయిల కోసం ఇప్పటికే అప్పులు తీసుకురాగా.. వడ్ల పైసలు వస్తేనే ఆ అప్పులు క్లియర్​చేసే అవకాశముంది. అలాంటిది పెట్టుబడుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వడ్లమ్మి నెల అయితాంది..

యాసంగి వడ్లు అమ్మి నెల అయితాంది.. ఇప్పటిదాకా పైసలు పడలే. వానాకాలం పెట్టుబడికి డబ్బులు లేవు. వడ్ల పైసలు వస్తేనే వానాకాలం పంట వేసే పరిస్థితి ఉంది. వెంటనే సర్కార్​రైతులందరికీ వడ్ల పైసలు వేయాలి. 

- సిర్రం కొంరయ్య, రైతు, ధర్మారం

ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే రైతుల ఖాతాల్లో వేస్తాం.. 

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేవు. జిల్లాలోని  అన్ని కొనుగోలు సెంటర్లలో  ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశాం. నిల్వ సామర్థ్యానికి మించి జిల్లాలో యాసంగి దిగుబడి వచ్చింది. మిల్లులు ఇతర గోదాములకు వడ్లు తరలిస్తున్నాం.ఇప్పటికే జిల్లాకు రూ.330 కోట్లు రిలీజ్​అయ్యాయి. మిగతా అమౌంట్​విడుదల కాగానే రైతుల అకౌంట్లలో వేస్తాం. 

- అడిషనల్ కలెక్టర్ ,రాజన్న సిరిసిల్ల జిల్లా