ఆయిల్​పామ్​ మొక్కల కోసం రైతుల ఎదురుచూపు

ఆయిల్​పామ్​ మొక్కల కోసం రైతుల ఎదురుచూపు
  • ఉమ్మడి జిల్లాలో 16 వేల 980 ఎకరాల సాగు లక్ష్యం
  • ఇప్పటివరకు సాగు చేసింది.. వెయ్యి ఎకరాల్లోనే..
  • మొక్కల పంపిణీలోవిఫలమైన ప్రైవేట్​ ఏజెన్సీ.. 
  • ఆయిల్​ఫెడ్​కు ఇవ్వాలంటున్న అధికారులు

సూర్యాపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఆయిల్​పామ్​ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం మాటలకే పరిమితమవుతోంది. ప్రత్యామ్నాయ పంటగా  ఆయిల్​పామ్​ను సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పించడంతో జిల్లా రైతులు భారీ సంఖ్యలోనే సిద్ధమయ్యారు.  సాగుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నప్పటికీ సకాలంలో మొక్కలను అందించకపోవడంతో వేరే  ​పంటల సాగుపై ఫోకస్​ పెడుతున్నారు. దీంతో  జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై సందిగ్ధత నెలకొంది. 

ఉమ్మడి  జిల్లాలో 16 వేల 980 ఎకరాల టార్గెట్

నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 2022-23 సంవత్సరానికి మొత్తం 16,980 ఎకరాల్లో అయిల్ పామ్​సాగు చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యం పెట్టింది. అధికారులు అవగాహన కల్పించడంతో నీటి వనరులున్న రైతులంతా ఆయిల్​పామ్​మొక్కలు పెంచేందుకు ముందుకొచ్చారు.   

మొక్కలు కరువు

జిల్లాలో 2023 మార్చి నాటికి లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.  9 లక్షల10వేల 860 మొక్కలు అవసరం కాగా,  మొక్కలను ఏడాది పాటు నర్సరీలో పెంచిన అనంతరం రైతులకు అందజేయాల్సి ఉంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో మొక్కల  పంపిణీ టెండర్​ను ‘రుచి సోయా’ ఏజెన్సీ  దక్కించుకుంది. వారు ఇప్పుడు మొక్కలను పెంచుతుండడంతో  ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో  కలిపి వెయ్యి ఎకరాల్లో మాత్రమే  మొక్కలు పంపిణీ చేసినట్లు హార్టికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నారు. 9 లక్షల 1 0వేల 860 మొక్కల కోసం మరో ఏడాది ఆగినా ఇంకా లక్షన్నర మొక్కలు మాత్రమే రైతులకు అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్  ఆధ్వర్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  నర్సరీలలో మొక్కలను తీసుకొచ్చి రైతుల అవసరం మేరకు అందించి ప్రోత్సహిస్తుంటే 2 జిల్లాల్లో మాత్రం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పడంతో మొక్కల సాగులో వెనుకంజలో ఉంది. ఆయిల్​ఫెడ్ కార్పొరేషన్  ఆధ్వర్యంలో నడుస్తున్న  యాదాద్రి భువనగిరి జిల్లాలో  3,500 ఎకరాల్లో సాగుచేసుకుంటూ రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. 

ప్రైవేట్ ఏజెన్సీతో నష్టపోతున్న రైతులు

ఉమ్మడి జిల్లాలో అధికారులకు టార్గెట్ పెట్టి మరి రైతులను  ఆయిల్​పామ్​సాగు వైపు దృష్టి మళ్లించారు.  తమకు దేశ వ్యాప్తంగా  బ్రాంచీలు ఉన్నాయని  మొక్కలు సరఫరా చేసి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సాగు చేపడతామని టెండర్ తీసుకున్న ‘రుచి సోయా’ ఏజెన్సీ మొక్కల పెంపకం, నిర్ణీత సమయానికి రైతులకు అందించడంలో  విఫలమవుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. లీడర్లు, రైతులు  మొక్కల కోసం హార్టికల్చర్ ఆఫీసర్ల పై ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ  నర్సరీల్లో మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ఆఫీసర్లు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.  మొక్కలు అందే పరిస్థితి లేకపోవడంతో  ఒక పంట నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్న రైతులు ఇతర పంటలను సాగు చేస్తున్నారు.  టార్గెట్ కు అనుగుణంగా మొక్కలను సరఫరా చేయని కంపెనీని తప్పించి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు అప్పజెప్పాలని జిల్లా  అధికారులు.. రాష్ట్ర అధికారులను కోరినట్లు సమాచారం. 

పంట నష్టపోయాను 

ప్రభుత్వం ఆయిల్ పామ్​ సాగుతో మంచి లాభాలు వస్తాయని చెప్పడంతో  ఉన్న రెండెకరాల్లో 16 గుంటల్లో ఆయిల్​పామ్​సాగు కోసం 6 నెలల కింద అప్లికేషన్ పెట్టుకున్నాను. ప్రభుత్వం మొక్కలు ఇస్తదన్న ఆశతో గుంతలు తీసి పెట్టుకున్నా. ఆరు నెలలు గడుస్తున్నా..  మొక్కలు ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు.  మొక్కలు  ఎప్పుడు ఇస్తరో.. ఏమో.. ఇప్పటికే పంట నష్టపోయా. 

 – కాకునూరి వెంకట్ రెడ్డి, పరెడ్డి గూడెం

త్వరలోనే మొక్కలను పంపిణీ చేస్తాం

జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు కోసం మొక్కలను పంపిణీ చేసే బాధ్య ‘రుచి’ సోయా కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో సాగు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. మొక్కలు ఇంకా పెరిగే సమయం ఉన్నందున రైతులకు సరఫరా చేయలేకపోయాం. త్వరలోనే మొక్కలను పంపిణీ చేస్తాం. ఇప్పటికే డ్రిప్ సిస్టమ్, గుంటలను తీసి అన్నీ  సిద్ధంగా ఉంచాం. 

–  శ్రీధర్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్