మార్కెట్లో పడిపోతున్న పత్తి ధర.. రైతుల్లో ఆందోళన

మార్కెట్లో పడిపోతున్న పత్తి ధర.. రైతుల్లో ఆందోళన
  •     మార్కెట్​లో పడిపోతున్న ధర
  •     సీజన్‌‌‌‌కు ముందు క్వింటాల్‌‌‌‌ రూ.10వేలు
  •     కొనుగోళ్ల ప్రారంభంలో రూ.8 వేలు
  •     అక్టోబర్​ చివరి నాటికి రూ.7 వేలకు పడిపోయిన ధర
  •     నవంబర్​లో స్వల్పంగా పెరుగుతున్న రేటు
  •     మార్కెట్​లో కనిపించని పత్తి

హైదరాబాద్‌‌, వెలుగు : మార్కెట్‌‌లో కాటన్‌‌ ధర పెరుగుతూ.. తగ్గుతూ.. రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. పత్తి సీజన్‌‌ ప్రారంభానికి ముందు క్వింటాల్ రూ.10వేలు పలికింది. పంట చేతికి వచ్చే సరికి రేట్​ తగ్గుతూ వస్తున్నది. దీంతో రైతుల్లో బుగులు మొదలైంది. జులై, ఆగస్టుల్లో పడిన వర్షాలకు పంట దెబ్బతిన్నది. దీంతో సాగు బాగా పడిపోయింది. అనుకున్నంత పూత, కాత రాలేదు. అదే టైంలో వర్షాలు పడటంతో పంటపై చాలా ఎఫెక్ట్​ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి ధరకు మార్కెట్‌‌లో డిమాండ్‌‌ పెరిగితేనే పెట్టిన పెట్టుబడి దక్కుతుందని రైతులంటున్నారు. అక్టోబర్‌‌ ప్రారంభంలో కొంత మెరుగ్గా ఉన్నా.. నెలాఖరుకు ధర పడిపోయింది.

అక్టోబరు నెలాఖరు వరకు తగ్గిన ధర..

కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌‌కు రూ.6,380 మద్దతు ధర ప్రకటించింది. కానీ ఈ ఏడాది బహిరంగ మార్కెట్​లో మద్దతు ధర కంటే ఎక్కువే ఉంది. దిగుబడి చాలా పడిపోయింది. నిరుటి కంటే ధర తగ్గుతుండటంతో రైతులు ఫికర్​ చేస్తున్నరు. పత్తి కొనుగోళ్ల ప్రారంభంలో క్వింటాల్‌‌ పత్తి రూ.8వేల నుంచి రూ.8,600 దాకా ధర పలికింది. తర్వాత తగ్గుతూ అక్టోబర్‌‌ నెలాఖరుకు క్వింటాల్‌‌ రూ.7వేల నుంచి రూ.7,330కి చేరుకుంది. ఇప్పుడు మార్కెట్‌‌కు పత్తి రావడం తగ్గిపోయింది. దీంతో తిరిగి ధరలు పుంజుకునే పరిస్థితులు ఉన్నాయని మార్కెట్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నరు.

స్టేబుల్‌‌గా ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌..

ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌లో కాటన్‌‌ బేళ్లు, కాటన్‌‌ సీడ్‌‌ ధరలు ప్రస్తుతం స్టేబుల్‌‌గా ఉన్నాయి. న్యూయార్క్‌‌ స్టాక్‌‌ ఎక్స్ఛేంజ్​లో కాటన్​ బేల్‌‌ ధర రూ.63వేల దాకా ఉంది. డిసెంబర్‌‌ చివరి దాకా స్టేబుల్‌‌గా ఉండే చాన్స్​ ఉందని నిపుణులు అంటున్నారు. బేళ్ల ధర పెరిగితేనే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే స్పిన్నింగ్‌‌ మిల్లుల్లో ఉన్న పాత్ యార్న్‌‌ రెండు.. మూడు నెలలుగా మూమెంట్‌‌ కాలేదు. ఈ క్రమంలో తిరిగి ధరలు పెరిగే చాన్స్ ఉందా.. లేదా.. అనే అంతుపట్టకుండా ఉందని బిజినెస్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌  అంటున్నారు. అంతర్జాతీయంగా ధర పెరిగే అవకాశం ఉందని, రైతులు తొందరపడి పత్తిని అమ్ముకోవద్దని మార్కెట్‌‌ వర్గాలు అంటున్నాయి.

తగ్గిన సాగు.. పడిపోతున్న దిగుబడి..

పత్తి సాగు 70లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్ర సర్కారు టార్గెట్‌‌ పెట్టింది. కానీ, రైతులు 50 లక్షల ఎకరాలే సాగు చేశారు. నిరుడు 46.25 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 69.46 లక్షల బేళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. నిరుడు కాటన్‌‌ దిగుబడి బాగా పడిపోయి 20 లక్షల బేళ్లు మాత్రమే మార్కెట్‌‌కు వచ్చింది. మరో 7లక్షల బేళ్లు ఇతర రాష్ట్రాలకు పోయింది. ఇలా 27లక్షల బేళ్లే ప్రాసెసింగ్ అయ్యాయి. ఈసారి పత్తి 50లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 53.28 లక్షల బేళ్ల ఉత్పత్తి కావొచ్చని స్టాటిస్టికల్‌‌ విభాగం అంచనాలు వేసింది.  ఈయేడు కనీసం 40 నుంచి 45లక్షల బేళ్ల కాటన్‌‌ వస్తుందని మార్కెట్‌‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సరైన దిగుబడి రాకపోతే ధర కొంత పెరిగే చాన్స్​ ఉందని మార్కెట్‌‌ వర్గాలు అంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌‌లో పత్తి సాగు పర్వాలేదు. నార్త్‌‌ ఇండియాలో సాగు తగ్గింది. తమిళనాడులో కొంత పెరిగింది.

కాటన్‌‌ మార్కెట్‌‌ కన్ఫ్యూజన్​లో ఉంది

దేశ వ్యాప్తంగా సాగు బాగానే ఉన్నప్పటికీ.. మార్కెట్​కు పంట రావట్లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దీంతో పత్తికి ధర పెరుగుతున్నది. స్పిన్నింగ్‌‌ మిల్స్‌‌లో యార్న్‌‌ మూమెంట్ లేదు. తమిళనాడులో క్లాత్ ప్రొడక్షన్‌‌ తగ్గించుకున్నరు. రాష్ట్రంలో లాస్ట్‌‌ ఇయర్‌‌ కంటే క్రాప్‌‌ పెరిగింది. 45లక్షల బేళ్లు వస్తాయని అంచనా వేస్తున్నం. ప్రస్తుతం 8వేల పైచిలుకు ధర ఉంది. ఇంటర్నేషనల్‌‌ మార్కెట్‌‌కు.. ప్రస్తుతం ఉన్న ఫిజికల్‌‌ మార్కెట్‌‌కు తేడా ఉంది. ఫ్యూచర్‌‌ మార్కెట్‌‌ ప్రకారం జనవరి దాకా కాటన్‌‌ బేళ్ల ధర రూ.63వేల దాకే ఉంది. దీంతో ధర పెరుగుతుందో.. లేదో.. అర్థం గాక కాటన్‌‌ మార్కెట్‌‌ కన్ఫ్యూజన్‌‌లో ఉంది.
- రవీందర్‌‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, 
జిన్నింగ్‌‌ మిల్స్‌‌ అసోసియేషన్‌‌