గిట్టుబాటు ధర కోసం పత్తి రైతుల ఎదురుచూపులు

గిట్టుబాటు ధర కోసం పత్తి రైతుల ఎదురుచూపులు

గంపెడాశలతో పత్తి పండించిన రైతన్న చిత్తవుతున్నాడు. గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో పండించిన పంటను ఇళ్లలోనే నిల్వ చేశారు. అయితే ఎప్పటికప్పుడు ధర తగ్గుతూనే వస్తోంది. ఇది చూసిన రైతన్న గుండె గుబేల్​మంటోంది. ఇన్ని రోజులు నిల్వ చేసిన రైతులు ఇకముందయినా ధర పెరుగుతుందేమోనన్న ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు అగ్నిప్రమాదాలు కూడా పొంచి ఉండడంతో ఎటూ తేల్చుకోలేపోతున్నాడు రైతన్న. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి గిట్టుబాటు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. 

ఆసిఫాబాద్, వెలుగు : పత్తి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఏడు ధర మరింత తగ్గుతూ వస్తోంద. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో క్వింటాలుకు రూ. 9 వేలతో ప్రారంభమై క్రమక్రమంగా తుగ్గుతూనే వస్తోంది. నవంబర్, డిసెంబర్ నెలలో క్వింటాలుకు రూ.8 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 7 వెల మాత్రమే ధర పలుకుతుండడంతో రైతులు నిరాశకు గురయ్యారు. నిల్వ ఉంచిన పత్తిని మార్కెట్ లో అమ్ముకోలేక ఇండ్లలో నిల్వలు ఉంచలేక దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం రైతుల ఇండ్లలోనే పత్తి పంట పేరుకుపోయి ఉంది. ఏటా సంక్రాంతి తర్వాత ధర పెరుగుతుండేది. ఈసారి కూడా పెరగవచ్చనే ఆశతో రైతులు ఎదురుచుస్తున్నారు. అయితే ఏకంగా క్వింటాలుకు రూ. 3 వేలు ధర తగ్గడంతో రైతులు ఆమోమయంలో పడ్డారు. ప్రభుత్వం పత్తి పంటకు గిట్టుబాటు ధర రూ.15 వేలు కల్పించి రైతులను ఆదుకోవాలని రైతు హక్కుల పోరాట సమితి(ఆర్ హెచ్ పీఎస్) ఆధ్వర్యంలో సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ను జిల్లా వ్యాప్తంగా రైతులు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికి నిరసనలో పాల్గొనడానికి సన్నద్ధం అవుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

దిగుబడి కూడా తగ్గింది...

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 33,535 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది రైతులు ఎక్కువగా పత్తి సాగు చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా ప్రారంభ దశ నుంచే పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది.అధిక వర్షాల ప్రభావంతో దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది.20 క్వింటాళ్లు పండించే రైతులు 10 క్వింటాళ్లే చేతికి అందుకోగలిగారు. అయినా పంటకు మద్దతు ధర లేకపోవడంతో పత్తి రైతులు దిగాలు పడ్డారు. 

అందని మద్దతు ధర.. తీరని అప్పులు

జిల్లాలో రైతులు పత్తి సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి కూడా అధికంగానే ఉంటోంది. ఎకరానికి రూ.30 నుంచి రూ.50 వేలు ఖర్చు అవుతోంది. ఎకరానికి కనీసం 10 క్వింటాళ్ల దిగుబడి వస్తే తప్ప పెట్టుబడులు వెళ్లే పరిస్థితి ఉండదు. ఈసారి సగానికి సగం దిగుబడి తగ్గడంతో పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణాలను తక్కువగానే పంపిణీ చేశారు. దీంతో రైతులు ప్రైవేటు లో అప్పులు చేసి సాగు చేసే పరిస్థితి తప్పలేదు. చేతికి అందిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అమ్మలేక ఇండ్లలోనే నిల్వలు ఉంచగా చేసిన అప్పులు తీర్చలేక దిగులు చెందుతున్నారు. మరోవైపు ఇండ్లలో నిల్వలు ఉంచిన పత్తిని కాపాడుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారింది. మరో పక్క ఎలుకల బెడద పెరిగిపోతుంది. ఎక్కువ కాలం నిల్వలు ఉంచితే పత్తి పంట బరువు తగ్గే అవకాశాలు కుడా లేకపోలేదు.

నిప్పంటుకొని 80 క్వింటాళ్ల పత్తి దగ్ధం..

కాగజ్ నగర్ మండలంలోని రాస్పల్లిలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని రైతు పెర్క సంతోష్ కు చెందిన ఇంట్లో తాను పండించిన పత్తి పంట సుమారు 80 క్వింటాళ్లతోపాటు 20 క్వింటాళ్ల వరి ధాన్యం నిలువ చేశాడు. శనివారం రాత్రి ప్రమాదవశత్తు నిల్వ చేసిన పత్తి కుప్పకు నిప్పు అంటుకుంది. దీన్ని గమనించిన రైతు చుట్టుపక్కల ఉన్న రైతులతో కలిసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఎండిన పత్తి కావడంతో ఇల్లుతో సహా పూర్తిగా కాలిపోయింది. వడ్లు కూడా కాలిపోయాయి. ధర లేక ఇంటి దగ్గర నిల్వ చేస్తే ఇలా కాలిపోయి బతుకు ఆగం చేసిందని రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చివరకు ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరున్నర లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ప్రాణం తీసిన పత్తి నిల్వలు..

పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి కుప్ప  బాలుడి ప్రాణం తీసింది. కౌటాల మండలంలోని కన్నేపల్లి గ్రామానికి చెందిన చెన్నుర్ కైలాష్(10) అన్న చెల్లెలుతో కలిసి దాగుడు మూతలు ఆడుకుంటున్న సమయంలో పత్తి నిల్వల్లో దాకునేందుకు వెళ్లగా తలకిందులై పత్తిలో ఇరుక్కుపొయి ఊపిరాడక మృతి చెందాడు.

అప్పులు తీర్చే పరిస్థితి లేదు..

ఈసారి మూడెకరాల్లో పత్తి సాగు చేసిన.7 క్వింటాళ్ల వరకు దిగుబడి చేతికి అందింది. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టిన. మద్దతు ధర లేక పత్తి అమ్మలేక పోతున్న. క్వింటాలుకు కనీసం రూ.15 వేలు కల్పిస్తే తప్ప చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మా సేటు(వ్యాపారి) తిరిగి అప్పులు ఇవ్వలేరు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి.   – గెడం ఇస్రూ, రైతు, జైనూర్

 జిల్లా బంద్ సక్సెస్ చేయాలి..

పత్తి పంటకు గిట్టుబాటు ధర రూ.15 వేలు కల్పించాలనే డిమాండ్ తో సోమవారం జిల్లా బంద్ చేస్తున్నం. రాస్తారోకో, నిరసనలు చేపడ్తాం. రైతులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతుల కోసం పోరాటాలు చేస్తాం. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇండ్లలోనే పత్తి పంట నిల్వ చేశారు. అగ్ని ప్రమాదం జరిగేతే  ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
– రూప్నర్ రమేష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆసిఫాబాద్

రేటు రాక అమ్మలే..

నేను పది ఎకరాలు కౌలుకు తీసుకుని పట్టి పత్తి పంట పెట్టిన. 90 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. అమ్ముదా మంటే పత్తి రేటు దిగింది. రేటు పెరుగుతదేమో అని చూస్తే రోజురోజుకు దిగుతోంది కానీ పెరుగుత లేదు. పెరుగుతదో, దిగుతదో అన్న భయం పట్టుకున్నది. అప్పులకు మిత్తి పెరిగిపో తాంది. గవర్నమెంట్ పత్తి రేటు పెంచితే మంచిగుంటది. 
– చప్పిడి గణపతి, రైతు, దహెగాం