యుద్ధ ప్రాతిపదికన రైతులకు.. యూరియా అందించాలి

యుద్ధ ప్రాతిపదికన రైతులకు.. యూరియా అందించాలి

యూరియా సరఫరా లేదా! సరఫరాలో ప్లానింగ్ లేదా! కృత్రిమ కొరత ఉందా! బ్లాక్ జరుగుతోందా! పక్క రాష్ట్రాలకు పోతోందా! అధిక ధరలకు అమ్ముతున్నారా! వీటిని పరిశీలించకుండా రాష్ట్రంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు! ఇది ఇప్పుడు అవసరమా! రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గమనించినట్లయితే.. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది! ఎందుకీ రైతులు రాత్రింబవళ్లు సహకార బ్యాంకు గోదాముల వద్ద  క్యూలైన్​లో ఉంటూ.. పట్టా పాస్ బుక్కులు, చివరికి చెప్పులు కూడా క్యూలైన్లులో పెడుతూ, లైన్​లో ఘర్షణలు పడుతూ, కొన్నిచోట్ల లాఠీచార్జీలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనికి బాధ్యులు మీరంటే మీరు అన్నట్లు అధికారంలో ఉన్న  కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆరోపణలు చేస్తూంటే.., రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్​ఎస్ నాయకులు.. పాలకుల వైఫల్యమే అంటూ, ఎరువులు సరఫరా చేయలేని చేతకాని ప్రభుత్వాలంటూ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. విమర్శలు, మాటలు పక్కకుపెట్టి యుద్ధప్రాతిపదికన ఎరువులు సరఫరా జరిగేలా చూడమని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు, సరఫరా పూర్తిగా కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. రాష్ట్రం గత ఏడాది వేసిన పంటలను దృష్టిలో పెట్టుకుని 10 శాతం విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఖరీఫ్ సీజన్ రాకముందే ప్లాన్ రూపొందించి రాష్ట్రానికి  20 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు కావాలని  కేంద్రాన్ని  కోరినామని  రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

ఎరువుల కేటాయింపులో పక్షపాతం ఉందా?

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయించిన ఎరువులు పరిశీలిస్తే తెలంగాణపై కొంత పక్షపాతం చూపిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ సంవత్సరం పంటల సేద్యం పెరగవచ్చుననే దృష్టితో రాష్ట్రం 20 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలని కోరితే, రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది 9.80 లక్షల టన్నులు మాత్రమే. అది జూన్,- జులై-,  ఆగస్టు ఆఖరినాటికి 8.30 లక్షల టన్నులు సరఫరా చేయాల్సిఉండగా ఈనెల ఆఖరికి వచ్చింది 5.66 లక్షల టన్నులు మాత్రమే. ఆ వివరాలు వ్యవసాయశాఖ మంత్రి పత్రికా ముఖంగా వివరించారు. ఇంకా సుమారు 3 లక్షల టన్నుల లోటు ఉండటం.. 

సకాలంలో కేంద్రం సరఫరా చేయకపోవటంతో 

రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఎప్పటికప్పుడు వస్తున్న ఎరువులను  మానిటరింగ్ చేస్తూ  యూరియాను డిమాండ్ ఉన్న ప్రాంతానికి  పంపిస్తున్నామని, రైతులు ఎరువులు దొరకవని ఆందోళన  చెందనవసరం లేదని ప్రభుత్వంప్రకటించింది.

సబ్సిడీ భారం తగ్గించుకునే ప్రయత్నమా!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇచ్చిన 2 లక్షల టన్నులు ఇప్పటికే రాష్ట్రం వద్ద నిల్వలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు పంపుతున్నామని.. రూ. 80,000 కోట్లు  సబ్సిడీ భరించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. యూరియాపై ప్రభుత్వం భరిస్తున్న సబ్సిడీ ఎక్కువగా ఉంది. ఇతర దేశాల నుంచి  దిగుమతి చేసుకోవాలి. చైనా నుంచే 20 శాతం దిగుమతి చేసుకోవాలి. సబ్సిడీని తగ్గించుకొనే ఎత్తులో భాగంగా తక్కువలో  తెప్పించుకొనే ప్రయత్నం చేస్తుందని  కేంద్రంపై విమర్శలు ఉన్నాయి.

ఏదేమైనా అన్నదాతలకు అగచాట్లు తప్పట్లేదు. ఈసారి తెలంగాణలో వర్షాలు ముందుగానే రావడం మొదలై పలు పంటల సాగు అధికమైంది.1.32 కోట్ల ఎకరాలకుగాను ఇప్పటివరకు 70 శాతం  సేద్యం అంటే 62.1 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు.  వర్షాలు సకాలంలో రావడంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఈ నెలలో ఇంకొక 30 శాతం పంటలు వేయటానికి రైతులు సిద్ధం అవుతున్నారు.  ఇప్పటివరకు జరిగిన సేద్యంలో వరి 33.25 లక్షలు ఎకరాలలోను,  ప్రత్తి 43.80 లక్షల ఎకరాలలోను,

మొక్కజొన్న 6.05 లక్షలు ఎకరాల్లో,  సోయాబిన్ 4.06 లక్షల ఎకరాలలో,  కందులు 4.68 లక్షల ఎకరాలలో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వేసిన పంటలకు 15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది.  దాంతో డిమాండు ఎక్కువగా ఉండి.. సరఫరా తక్కువగా ఉండటంతో.. పంపిణీ కేంద్రాల దగ్గర  వేకువ జాము నుంచే పడిగాపులు కాస్తున్నప్పటికీ సరుకు కొంతమందికే అందటంతో  చాలామందికి  రిక్తహస్తాలే ఎదురవుతున్నాయి. 

ప్రయివేటు డీలర్ల వద్ద ఎక్కువ ధరకు..

ప్రభుత్వం యూరియా అలాట్​మెంట్​ 70 శాతం రైతు సహకార సంఘాలకు (సింగిల్ విండోలకు) అలాట్​మెంట్ ఇస్తున్నప్పటికీ.. సొసైటీ సిబ్బంది చేతి వాటానికి లోనై అందులో ఒకటి, -రెండు లారీలు అక్రమంగా ప్రైవేట్ డీలర్ల వద్దకు చేరుతున్నాయి. డిమాండును అడ్డుపెట్టుకొని వారు పలుచోట్ల నల్ల బజారు విక్రయాలు యధేచ్ఛగా రూ.266 బస్తాను రూ. 400 వరకు అమ్ముతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇది రైతులే చెప్పుతున్నారు. చేతిలో డబ్బులు లేనివాళ్లు విత్తనాలను పంట మీద ఇస్తామని ఎక్కువ వడ్డీకి అప్పుతీసుకొంటున్నారు. ఎరువులు కూడా డీలర్ల వద్ద అధిక ధరలకు తీసుకుపోతున్నారు. డబ్బున్నవాళ్ళు ఇదే అదునుగా ముందు జాగ్రత్తతో దొరుకుతావో లేదో అని 4 బస్తాలు అవసరమున్నా.. 10 బస్తాలు అదనంగా స్టాకు సేకరించుకొని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. దీనితో కృత్రిమ కొరత నెలకొంటున్నదని విమర్శలు వస్తున్నాయి.

పక్క రాష్ట్రాలకు తరలుతున్న యూరియా 

పారిశ్రామిక అవసరాల కోసం వ్యవసాయ యూరియాను దారి మళ్ళిస్తున్నట్టు ఇటీవల వెలుగు చూసింది. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఎరువుల కొరత ఉండటంతో సరిహద్దు జిల్లాల నుంచి కర్ణాటకకు, మహారాష్ట్రకు,  ఏపీకి  దొంగచాటుగా తరలిస్తున్నట్టు ఇటీవల చెక్ పోస్టుల వద్ద బయటపడింది.

రసాయన ఎరువులు తగ్గించాలి!

రాష్ట్రంలో సగం సాగు భూముల్లో 1.5 శాతం ఉండాల్సిన సేంద్రీయ కర్బనం వాస్తవంగా 0.5 శాతమే ఉంది. జింకు 50 శాతం, బోరాన్  25 శాతం, ఇనుము 8 శాతం మేరకు మొదలై సూక్ష్మ పోషకాల కొరత బాగా నెలకొంది. అందుకు అతిగా రసాయన ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానం లేనందున నేలలో మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. అతిగా నీరు పెట్టడం, ఎరువులు, రసాయనాలు వాడటం వల్ల భూసారం క్షీణిస్తుంది. రసాయన ఎరువులు,  గుమ్మరిస్తే ఫల సాయం రెట్టింపు కాదు. దీనిపై రైతాంగంలో అవగాహన పెంచడంలో ప్రభుత్వాల వైఫల్యం.. మన ఆహార భద్రతనే ప్రమాదంలోనికి నడుతుంది. గత ఆర్థిక సంవత్సరం దేశీయ పొలాల్లో సుమారు 6.56 కోట్ల టన్నుల ఎరువులు వెదజల్లినట్లు అంచనా.  
అంతకుముందు ఏడాది కన్నా అది 9 శాతం ఎక్కువ. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ అదేవిధంగా తెలంగాణలో ఎరువుల వాడకం 82 శాతం దాకా అధికంగా ఉంది. సాగు భూములను కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహిస్తూ,  తగినంత పరిణామంలోనే ఎరువులు చల్లేలా అన్నదాతను చైతన్య పరచాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి 
హెచ్చరించింది.

పార్లమెంటరీ స్థాయి సంఘ సిఫార్సులు 

ఎరువుల కొరత, రైతులు పడుతున్న ఇబ్బందులపై పార్లమెంటరీ స్థాయి సంఘం గతంలో ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక బృందాలను నెలకొల్పి సరఫరాలను పర్యవేక్షించాలని సూచించింది. రసాయనాలు, ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ వనర్లు ఉపయోగించేలా రైతులను చైతన్యం చేయాలని.. రైతులకు అందించే సబ్సిడీ యూరియాను ఇతర అవసరాలకు.. పరిశ్రమలలో వాడకంపై నిఘా పెంచాలని సూచించింది. రైతులు ఎదుర్కొంటున్న  తక్షణ అవసరమైన యూరియాను యుద్ధ ప్రాతిపదికన అందించాలని, అందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని  రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- ఉజ్జిని రత్నాకర్ రావు,​ సీపీఐ సీనియర్ నేత