యాసంగి సీజన్ కు సాగు నీరెట్లా?

యాసంగి సీజన్ కు సాగు నీరెట్లా?
  • జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు వారబందీ ప్రకటించిన ఆఫీసర్లు
  • తగ్గుతున్న శ్రీశైలం బ్యాక్ వాటర్ 
  • ఎత్తిపోతల పథకాలకు తప్పని నీటి గండం

వనపర్తి, వెలుగు: వానాకాలం సీజన్ లో రైతులు వేసుకున్న పంటలు చేతికి  రావడంతో యాసంగి సాగుపై రైతులు దృష్టి పెడుతున్నారు. అయితే పంటలకు సాగు నీళ్లు ఎలాగనే ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్, జనవరిలో యాసంగి సీజన్  ప్రారంభమవుతుంది. వరితో పాటు ఆరుతడి పంటలను ఉమ్మడి జిల్లా రైతులు సాగు చేస్తారు. ఈ సారి వానాకాలంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దగా వరద రాలేదు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్  పూర్తి స్థాయిలో నిండలేదు. 

శ్రీశైలం రిజర్వాయర్  బ్యాక్ వాటర్ పై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు యాసంగిలో బందు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక సాగుకు నీరు అందుతుందా? లేదా? అన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో కృష్ణా నదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద యాసంగి పంటలను పరిమితంగా సాగు చేయాలని ఇప్పటికే వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు రైతులకు సూచించారు. వారబందీ ప్రకటించిన తరువాత నీటి లభ్యతను బట్టి ఏఏ ప్రాంతాలకు నీరందుతుందో చెబుతామని అంటున్నారు.

ఖరీఫ్​లోనూ తప్పని తిప్పలు..

కాలువల్లో లోపాలు, నీటి కొరత కారణంగా వానాకాలం సీజన్ లోనే చివరి ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. తడులు సకాలంలో అందక దిగుబడులు దెబ్బతిన్నాయి. వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబాయి, పానగల్  మండలాల్లో రైతులు పంటలకు చివరి తడి అందించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. బోర్లు, బావులు లేని రైతుల  పంటలు ఎండిపోయాయి. దీంతో యాసంగి సీజన్​లో పంటల సాగుపై చివరి ఆయకట్టు రైతులు ఆశలు వదులుకున్నారు. మరికొందరు ఆరుతడి పంటలకు నీరు వదులుతారా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్నారు. 

వనపర్తి జిల్లాతో పాటు గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల రైతులు కృష్ణానది నీటి ఆధారంగా పంటలు సాగు చేస్తారు. జూరాల ప్రాజెక్టు కుడి కాలువ కింద 85 వేల ఎకరాలు, కుడి కాలువ కింద 30 వేల ఎకరాల్లో వానకాలం సీజన్ లో వరి నాట్లు వేసుకున్నారు. ఈ పంటలు దాదాపుగా కోతకు వచ్చాయి. అలాగే వనపర్తి జిల్లాలోని భీమా పేస్–2  కింద 50 వేల ఎకరాల్లో వరి పండించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 3 లక్షల ఎకరాలకు గాను, ఈ సారి లక్ష ఎకరాల వరకు సాగు చేసుకున్నారు. కోయిల్ సాగర్, సంగంబండ, భీమా ఫేజ్–1 పథకాల కింద వానాకాలం పంటలు పూర్తి కావొచ్చాయి. వరి కోతలు పూర్తయి ప్రస్తుతం కల్లాల్లో వడ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 

ఈ పనులు పూర్తయ్యాక పంటల సాగుపై దృష్టి పెట్టనుండగా, ఈ సారి చివరి ఆయకట్టుతో పాటు వరికి యాసంగిలో నీరు అందడం కష్టమేనని ప్రాజెక్టుల ఆఫీసర్లు  చెబుతున్నారు. యాసంగిలో వంటలు వేయకపోవడమే ఉత్తమమని మరికొందరు రైతులకు సలహా ఇస్తున్నారు. యాసంగిలో నీరు లేక క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ప్రాజెక్టుల కింద రెండో పంటగా ఆరుతడి పంటలే సాగు చేయాలని అధికారులు చెబుతున్నా, రైతులు మాత్రం వరి పంటపైనే దృష్టి పెడుతుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తగ్గుతున్న నీటి నిల్వలు..

జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఆరున్నర టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్  కూడా రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. పదేండ్లుగా శ్రీశైలం రిజర్వాయర్ కు పూర్తి స్థాయిలో నీరు చేరుతుండడంతో సమస్య రాలేదు. ఈ సారి వర్షాలు లేక నాగార్జునసాగర్ కు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయలేక పోయారు. 

ALSO READ : గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాం : కల్వకుంట్ల సంజయ్​

దీంతో శ్రీశైలం బ్యాక్ వాటర్  కూడా తగ్గుతూ వస్తోంది. ఒకపక్క కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి ట్రయల్ రన్  చేసి పది టీఎంసీల నీటిని డ్రా చేశారు. దీనికి తోడు ఏపీలోని పోతురెడ్డి పాడు ఎత్తిపోతల పథకం కూడా శ్రీశైలం నీటిని ఎప్పటికప్పుడు తోడేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నీటి నిల్వలు తగ్గుతూ పోతున్నాయి. దీంతో నీరందే పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు. అధికారుల ప్రకటనతో యాసంగి సీజన్ పై రైతులు ఆశలు వదులుకుంటున్నారు.