దళారుల చేతిలో దగా పడుతున్న రైతులు

దళారుల చేతిలో దగా పడుతున్న రైతులు

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న నిల్వలు

మహాముత్తారం, వెలుగు: 1001 రకం వడ్లను కొనుగోలు కేంద్రాల్లో తీసుకోకపోవడంతో రైతులు రూ. 1,500 కే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో పీఏసీఎస్​ఆధ్వర్యంలో 9, జీసీసీ ఆధ్వర్యంలో 4, డీసీఎంఎస్​ ఆధ్వర్యంలో 8, మ్యాక్స్​ ఆధ్వర్యంలో 4 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ‘ఏ’ గ్రేడ్​ రకానికి క్వింటాలుకు రూ. 2,060, కామన్​ గ్రేడ్​1001 రకానికి  క్వింటాలుకు రూ. 2,040 మద్దతు ధర నిర్ణయించారు. 

అయితే మిల్లు యజమానులు కామన్​ గ్రేడ్​1001 రకం వడ్లను తీసుకునేందుకు నిరాకరిస్తుండడంతో రైతులు క్వింటాలుకు రూ. 1,500కే దళారులకు అమ్ముకుంటున్నారు. దీంతో పెట్టుబడులు కూడా చేతికి రావడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలో సగానికి పైగా రైతులు కామన్​ గ్రేడ్​ 1001 రకం వడ్లను సాగు చేశారు. మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీరుమున్నీరవుతున్నారు. సెంటర్లలో వడ్లు కాంటా చేయకపోవడంతో కల్లాలన్నీ నిండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు కాంటాలు త్వరగా వేయాలని, 1001 రకం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.