అన్నదాతకు ‘హైబ్రీడ్’ కష్టం!.. కాయతాలు పేరుతో ఒక్కో లారీకి5 బస్తాలు కటింగ్.. రైతుకు ఎకరాకు రూ.8 వేల నష్టం

అన్నదాతకు ‘హైబ్రీడ్’ కష్టం!.. కాయతాలు పేరుతో ఒక్కో లారీకి5 బస్తాలు కటింగ్.. రైతుకు ఎకరాకు రూ.8 వేల నష్టం
  • కొత్త రకాలతో  దిగుబడి భారీగానే వచ్చినా కాయ తాలు ఎక్కువ
  •  కాయతాలు పేరుతో ఒక్కో లారీకి5 బస్తాలు కటింగ్​
  •  42 కిలోల వడ్లతో తూకం.. బీ గ్రేడ్​ అయితేనే ఓకే
  •  రైతుకు ఎకరాకు రూ.8 వేల నష్టం
  •  విధిలేని పరిస్థితుల్లో ఒప్పకుంటున్న రైతులు

జనగామ, వెలుగు: కొత్త హైబ్రీడ్​రకం వడ్లతో అన్నదాతకు కష్టం తప్పడం లేదు. వడ్లలో కాయ తాలు రాగా, 42 కిలోల వడ్లతో తూకం వేస్తూ బీ గ్రేడ్​ అయితేనే ఓకే చేస్తున్నారు. దీంతో మిల్లర్లకు కాసుల పంట పండుతోంది. కాయతాలు పేరుతో బస్తాల్లో తూకం ఎక్కువగా వేస్తున్నారు. ఒక్కో లారీకి 5 బస్తాలు కటింగ్​ చేస్తుండడం, హమాలీలకు, లారీ డ్రైవర్లకు చెల్లింపులు చేస్తూ రైతులు నష్టపోతున్నారు.

కొత్త హైబ్రీడ్​ విత్తనాలతో చేదు అనుభవం.. 

యాసంగి 2025 -26 సీజన్​లో మార్కెట్​లోకి కొత్త పేర్లతో అనేక హైబ్రీడ్​ వరి విత్తనాలు వచ్చాయి. వీటిని రైతులకు అంటగట్టడంలో విత్తన వ్యాపారులు సక్సెస్​ అయ్యారు. సంప్రదాయంగా సాగు చేసే ఆర్ఎన్ఆర్, 1010 వంటి రకాలతో ఎకరానికి 25 నుంచి 28 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. అగ్రికల్చర్​ ఆఫీసర్లు మాత్రం సగటున ఎకరానికి 23 క్వింటాళ్ల దిగుబడిగానే లెక్కలు చూపిస్తుంటారు. అయితే కొత్త హైబ్రీడ్​రకాలతో ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యాపారులు రైతులను నమ్మించారు. దీంతో చాలామంది రైతులు సంప్రదాయ రకాలైన ఆర్ఎన్ఆర్, 1010 పక్కన పెట్టి కొత్త హైబ్రీడ్​ విత్తనాలను సాగు చేశారు.  

గింజ పొడుగే.. లోపల కాయ తాలే..

కొత్త హైబ్రీడ్​ విత్తనాలతో సాగు చేసిన పంటలో దిగుబడి ఎక్కువగా వచ్చినట్లే కన్పించింది. వడ్లను శుభ్రం చేసేందుకు ఫ్యాన్లు ఉపయోగించినా తాలు పెద్దగా కన్పించలేదు. ఈ సీజన్​లో తేమ శాతం కూడా తక్కువగా ఉండటంతో రైతులు మంచి లాభాలు వస్తాయని భావించారు. సాధారణంగా ఆర్ఎన్ఆర్, 1010 రకాలలో గింజలో పాలు పూర్తిగా నిండటం వల్ల గింజ బరువు, నాణ్యంగా ఉంటుంది. ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్లకు పైగా దిగుబడి ఉంటోంది. అయితే ఈసారి కొన్ని రకాల హైబ్రీడ్​ రకాలతో 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినప్పటికీ, గింజలో పాలు పూర్తిగా నిండకపోవడంతో పైభాగం, కింది భాగం ఖాళీగా ఉండి మధ్యలో గింజ ఏర్పడింది. దీంతో గింజ చూడడానికి పొడువుగా కన్పించినా లోపల బరువు తక్కువగా ఉంది. కింద ఖాళీగా ఉండటం వల్ల ఫ్యాన్లతో శుభ్రం చేసినా అవి వేరుపడలేదు. మిల్లర్లు ఈ తరహా గింజలను ‘కాయ తాలు’ లేద ‘కర్ర తాలు’గా పరిగణిస్తున్నారు. 

బస్తాకు అదనపు తూకం.. లారీకి 5కు పైగా బస్తాల కోత

ఈ సీజన్​లో రైతులు కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లతో కుమ్మక్కైన కొందరు కొనుగోలు కేంద్రాల ఇన్​చార్జీలు 41 కిలోల బస్తాకు బదులుగా 42 కిలోల వరకు తూకం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లారీ డ్రైవర్లు గతంలో బస్తాకు రూపాయి మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు రూ.2 నుంచి రూ.5 వరకు డిమాండ్​ చేస్తున్నారు. హమాలీలు తూకం వేసినందుకు 40 కిలోల బస్తాకు రూ.22 నుంచి రూ.32 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మిల్లులకు వడ్లు చేరిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. 

ఏఈవోలు ఏ గ్రేడ్​గా గుర్తించినా, కొందరు మిల్లర్లు మాత్రం బీ గ్రేడ్​గా ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని చెబుతున్నారు. పైగా ‘కాయ తాలు’ పేరుతో లారీకి 5 నుంచి 10 బస్తాల వరకు కోత విధించిన తర్వాతే అన్​లోడ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాల భయంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో ఈ కోతలకు అంగీకరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎకరాకు రూ. 8 వేలు లాస్..​

‘కాయ తాలు’ పేరుతో జరుగుతున్న కోతలు రైతులకు గణీయమైన నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఎకరానికి కనీసం 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన రైతు పరిస్థితిని పరిశీలిస్తే క్వింటాల్​కు సుమారు 3 కిలోల అదనపు తూకం కారణంగా ఎకరానికి దాదాపు 80 కిలోల వడ్లు అదనంగా పోతున్నాయి. లారీకి 5 బస్తాల కోత్త విధిస్తే మరో 2 క్వింటాళ్ల వరకు నష్టం వస్తోంది. హమాలీ చార్జీల రూపంలో 25 క్వింటాళ్లకు సుమారు రూ.1,250 చెల్లించాల్సి వస్తోంది. లారీ డ్రైవర్లకు బస్తాకు సగటున రూ.3 చొప్పున మరో రూ.75 వరకు వెచ్చించాల్సి వస్తోంది. క్వింటాల్​కు కామన్​గ్రేడ్​ మద్దతు రూ.2,369గా లెక్కిస్తే మొత్తం కలిపి ఒక రైతు ఎకరానికి రూ.8 వేలు 
నష్టపోతున్నాడు.

సెంటర్లలో ఇంకా వడ్ల కుప్పలు..

వడ్ల కొనుగోళ్లపై ఇటీవల మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి కొనుగోళ్లను స్పీడప్​ చేయాలని ఆదేశించారు. అయినా అనేక సెంటర్లలో ఇంకా భారీ స్థాయిలోనే వడ్ల కుప్పలు కన్పిస్తున్నాయి. మిల్లులకు వెళ్లిన లారీలు తిరిగి రావడంలో జాప్యం జరగడంతో దాదాపు రెండు నెలలు కావస్తున్నా కొనుగోళ్లు పూర్తికాలేదు. జనగామ జిల్లాలో సివిల్ సప్లయ్ శాఖ 3 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటే, ఇప్పటివరకూ 30 వేల మంది రైతుల నుంచి 1.90 లక్షల టన్నులు సేకరించారు. ఇంకా 1.10 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అయితే ఈ నెల 15 వరకు వడ్ల కొనుగోళ్లు ముగిసే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.