
- ఆందోళనలో రైతులు, ఆర్గనైజర్లు
- గత ఏడాది పేమెంటే ఇంకా ఇవ్వని కంపెనీలు
గద్వాల, వెలుగు: సీడు కంపెనీలు, ఆర్గనైజర్ల ఇష్టరాజ్యం కొనసాగుతున్నది. కంపెనీలు రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చాక రైతులు పంట సాగు చేశారు. సీడ్ ఇచ్చిన కంపెనీలు గానీ, వారి ప్రతినిధులు గానీ ఆ తర్వాత పంట వైపు కన్నెత్తి చూడడంలేదు. గత ఏడాది పంటలకు సంబంధించి ఇవ్వాల్సిన రూ. 500 కోట్లు ఇంకా చెల్లించకపోవడం, ఈ సారి కంపెనీలు పత్తాలేకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో రైతులు ఫౌండేషన్ సీడ్ వేసిన తర్వాత ఆయా కంపెనీల సూపర్వైజర్లు నెలలో కనీసం రెండు సార్లు పంటను పరిశీలించేవారు. ఆ తర్వాత ఎన్ని ఎకరాల్లో సాగయ్యింది, ఎన్ని మొక్కలు వచ్చాయన్న వివరాలు నమోదు చేసుకుని రైతులకు, ఆర్గనైజర్లకు సలహాలు ఇచ్చేవారు.
కానీ, ఈసారి కంపెనీలు ముఖం చాటేశాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 కంపెనీలు దాదాపు 50 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు గాను రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చాయి. అయితే, కంపెనీల ప్రతినిధులు సీడ్ ఎలా ఉంది. మొక్కలు బాగా పెరిగాయా లేదా బెరికి మొక్కలు తొలగించారా లేదా , క్రాసింగ్ ఎలా చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోవడంలేదు. దీంతో తమకు అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు అందుతాయా లేదా అన్న భయం రైతులను వెన్నాడుతోంది.
గత ఏడాది డబ్బులు ఇవ్వలే
జోగులాంబ గద్వాల జిల్లాలో గత ఏడాది దాదాపు 60వేల ఎకరాలలో సీడ్ పంట సాగు చేశారు. అందుకు సంబంధించి రైతులకు 1,100 కోట్లు రావాల్సి ఉండగా.. ఆర్గనైజర్ల ద్వారా రూ. 600 కోట్ల వరకు రైతులకు చెల్లించారు. నాలుగు నెలల కిందటే రైతులకు పూర్తిగా డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఇంకా రూ. 500 కోట్లు బకాయి ఉండడంతో రైతులు కంపెనీల చుట్టూ తిరగాల్సివస్తోంది. ఈసారి సీడ్ పత్తి వేసిన రైతులకు కంపెనీలు ఏవీ అడ్వాన్సులు కూడా ఇవ్వలేదు. గత ఏడాది బకాయిలు కూడా చెల్లించని కంపెనీలు కొన్ని ఈసారి ఎకరానికి రెండు క్వింటాళ్ల సీడ్ మాత్రమే తీసుకుంటామని మెలిక పెడుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.
మంత్రి ఆదేశించిన స్పందన లేదు
సీడ్ కంపెనీలు రైతులకు డబ్బులు బకాయి పడిన విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. దీంతో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా సీడ్ కంపెనీలతో మీటింగ్ నిర్వహించి రైతులకు, ఆర్గనైజర్లకు చెల్లించాల్సిన డబ్బులు నెలలోగా ఇవ్వాలని ఆదేశించిన ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదని ఆర్గనైజర్లు, రైతులు చెబుతున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
సీడు పంట వేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఏ కంపెనీ ఎంత సీడ్ ఇచ్చారో రైతుల వారీగా వివరాలు తెలుసుకుంటున్నాం. కంపెనీలు పంట మొత్తం కొనే విధంగా వారితో అగ్రిమెంట్ చేపిస్తున్నాం. పేమెంట్ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.- లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్, గద్వాల.