యాసంగిలో మొదటి సారిగా 668 ఎకరాల్లో పత్తి వేసిన రైతులు

యాసంగిలో మొదటి సారిగా 668 ఎకరాల్లో పత్తి వేసిన రైతులు
  • ఇప్పటికే 10 లక్షలకు పైగా ఎకరాల్లో వరి నాట్లు, మొత్తం 20 లక్షల ఎకరాల్లో సాగు
  • రికార్డు స్థాయిలో 60 లక్షల ఎకరాల్లో సాగయ్యే చాన్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సాగు ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కలిసి 20లక్షలకు పైగా ఎకరాల్లో సాగు మొదలైంది. ఈ సీజన్​లో వరి, మక్క, పల్లి, పప్పుశనగ పంటలే ఎక్కువగా సాగు చేసే పరిస్థితులు ఉండడంతో రైతులు వీటికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యవసాయశాఖ నివేదికలో స్పష్టమైంది. అయితే, యాసంగిలో మొదటి సారిగా పత్తి సాగు చేయడం గమనార్హం. 

10 లక్షలకు పైగా ఎకరాల్లో వరినాట్లు

యాసంగి ముమ్మిరి నాట్లు షురూ కాకముందే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఈయేడు వరి సాగు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్​లో అత్యధికంగా 2.42 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. నల్గొండ జిల్లాలో 1.26 లక్షల ఎకరాల్లో, కామారెడ్డిలో 1.24 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జగిత్యాలలో 93వేలు, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 90వేల ఎకరాల్లో, యాదాద్రిలో 86వేల ఎకరాలు, సూర్యాపేటలో 68వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 40వేల ఎకరాల్లో  వరి సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ నివేదికలో తేలింది.

రికార్డు కొట్టనున్న వరి సాగు

ఈ యాసంగిలో వరి రికార్డు స్థాయిలో సాగయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు పెరిగి చెరువుల్లో, బావుల్లో నీరు ఉండటంతో వరి ఎక్కువగా సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో యాసంగి సాధారణ వరి సాగు అంచనా 33.53 లక్షల ఎకరాలు కాగా.. 2021 యాసంగిలో రికార్డు స్థాయిలో 52.80 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటివరకు ఇదే రాష్ట్రంలో రికార్డు స్థాయి వరి సాగుగా ఉంది. నిరుడు యాసంగిలో బాయిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివాదం నేపథ్యంలో వరి వేయొద్దని, తాము వడ్లు కొనేదిలేదని, వరేస్తే ఉరే అని సర్కారు ప్రచారం చేసింది. అయినా.. రైతులు 35.84లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీంతో రాష్ట్ర సర్కారు వడ్లు కొనక తప్పలేదు. ఈయేడు యాసంగిలో వరిపై ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి.. వరి సాగు గణనీయంగా పెరిగి వానాకాలాన్ని మించి సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

467 మంది రైతులు 668 ఎకరాల్లో..

ఈ యాసంగిలో మొదటిసారిగా పత్తి సాగు జరుగుతోందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఏటా వానాకాలంలో మాత్రమే జరిగే పత్తి సాగు.. ఈసారి యాసంగిలోనూ రైతులు పత్తి వేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 668 ఎకరాల్లో పత్తి వేసినట్లు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టు తేల్చింది. 467 మంది రైతులు పత్తిసాగు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం గమనార్హం.

పప్పుశనగ, పల్లి, మక్క కూడా ఎక్కువే..

యాసంగిలో సాగయ్యే పంటల్లో వరి తర్వాత పప్పుశనగ, మక్కలు, వేరుశనగ పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పప్పుశనగ 3.18లక్షల ఎకరాల్లో వేశారు. మక్కలు 2.73లక్షల ఎకరాల్లో వేయగా పల్లి 1.97లక్షల ఎకరాల్లో వేసినట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. ఆదిలాబాద్​ జిల్లాలో అత్యధికంగా 91వేల ఎకరాల్లో, ఆ తర్వాత కామారెడ్డిలో 84వేల ఎకరాల్లో పప్పుశనగ వేశారు. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గద్వాల జిల్లాల్లోనూ పప్పుశనగ సాగవుతోంది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 53వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా ఆ తరువాత నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 50వేల ఎకరాల్లో వేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జగిత్యాల, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గద్వాల జిల్లాల్లోనూ మక్క ఎక్కువగా వేశారు. నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అత్యధికంగా లక్ష ఎకరాల్లో పల్లిపంట సాగు చేశారు. వనపర్తి జిల్లాలో 22వేల ఎకరాలు, వికరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 21వేల ఎకరాలు,  మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గద్వాలలో 10వేల ఎకరాలు చొప్పున వేరుశనగ వేశారు.