ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

మధిర, వెలుగు: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్  ఏలూరి నాగేశ్వరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు డిమాండ్​ చేశారు. శుక్రవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్  రాంబాబుకు రైతాంగ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే వడ్డీతో సహా రుణమాఫీని అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఈ స్కీమ్​ కోసం రాష్ట్ర ప్రభుత్వం తనవంతు ప్రీమియం చెల్లించాలని డిమాండ్​ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు. ధరణి పోర్టల్​ను సమీక్షించి సమస్యలు తొలగించాలని డిమాండ్​ చేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి  చిలువేరు సాంబశివరావు, నాయకులు రామిశెట్టి నాగేశ్వరావు, పాపట్ల రమేశ్, గుండా చంద్రశేఖర్ రెడ్డి, కుంచం కృష్ణారావు, కోనా నరసింహారావు, కనపర్తి ప్రకాశ్, కొప్పురావూరి రామయోగేశ్వరావు, డీవీఎన్​ సోమేశ్వరావు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ పాల్గొన్నారు. 

రుణమాఫీ అమలు చేయాలి

ఎర్రుపాలెం: రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు తహసీల్దార్  కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తహసీల్దార్​ తిరుమలచారికి వినతిపత్రం అందించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతక్కి నరసింహారావు, పుప్పాళ్ల చంద్రమల్లేశ్వరరావు, మొక్కపాటి శ్రీనివాసరావు, దేవరకొండ కోటేశ్వరరావు, మిర్యాల నాగేశ్వరరావు, ఏడుకొండలు, మోహనరావు, రామకృష్ణ, బాబురావు పాల్గొన్నారు. 

మండల సమావేశం రసాభాస

బీఆర్ఎస్, కాంగ్రెస్  సభ్యుల మధ్య వాగ్వాదం

కామేపల్లి, వెలుగు: ఎంపీపీ బానోత్​ సునీత రాందాస్​ అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్  సభ్యుల వాగ్వాదం చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. విద్యుత్​ శాఖ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతుండగా లాల్య తండా సర్పంచ్  రామచందర్  అడ్డుకొని తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం లేదని, ఎమ్మెల్యే తమ గ్రామానికి ఫండ్స్​ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కామేపల్లి, ముచ్చర్ల సర్పంచులు రాందాస్, లూసి, మద్దులపల్లి ఎంపీటీసీ గబ్రునాయక్ అడ్డుకోవడంతో సమావేశం గందరగోళంగా మారింది. ఎక్సైజ్  ఎస్సై వసంత మాట్లాడుతుండగా, సభ్యులు అడ్డుకొని  మండలంలోని వైన్ షాపుల ఓనర్లు సిండికేట్ అయ్యి బెల్ట్ షాపులకు అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదని నిలదీశారు. జడ్పీటీసీ బి వెంకట ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో పసుమర్తి వెంకట సత్యనారాయణ గుప్తా, తహసీల్దార్  కోట రవికుమార్, మండల వైద్యాధికారి డాక్టర్​ స్రవంతి పాల్గొన్నారు‌. 

స్వర్ణ కవచధారిగా రామయ్య

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు బంగారు కవచాలతో దర్శనమిచ్చారు. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. తర్వాత మూలవరులను స్వర్ణ కవచాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, లక్ష కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. ప్రాకార మండపానికి సీతారాముల కల్యాణమూర్తులను తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించి సాయంత్రం అద్దాల మండపంలో దర్బారు సేవ చేశారు. ఈ సందర్భంగా స్వామికి సంధ్యాహారతి సమర్పించారు.

పీఏసీఎస్  గోదాం ప్రారంభం

సత్తుపల్లి, వెలుగు: మండలంలోని రేజర్ల గ్రామంలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాం, అగ్రి అవుట్​లెట్ ను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ200 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన గోదాం ఏర్పాటుతో ఎరువుల నిల్వకు అనువుగా ఉంటుందని, అగ్రి అవుట్ లెట్ తో పీఏసీఎస్​కు లాభాలు వస్తాయని అన్నారు. లైబ్రరీ చైర్మన్  కొత్తూరు ఉమామహేశ్వర రావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, ఎంపీపీ దొడ్డ హైమవతి శంకరరావు, ఆత్మ కమిటీ చైర్మన్  శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్​మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, గండ్ర సోమిరెడ్డి, చిలుకుర్తి కృష్ణమూర్తి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. 

అత్యవసర వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పోర్టల్ లో నమోదు చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యసేవలను ఆరోగ్య శ్రీ పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్  ఆదేశించారు. తన చాంబర్​లో వైద్య, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్లతో ఆరోగ్య శ్రీ సేవలు, కొత్తగూడెం జనరల్​ ఆసుపత్రి, రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో బయో మెట్రిక్ హాజరు, ఓపీ రిజిష్టర్ల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలు ఆన్​లైన్ చేయడంపై కోఆర్డినేటర్లు, ఆరోగ్య మిత్రలకు ట్రైనింగ్​ ఇవ్వాలని సూచించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలతో పాటు సిజేరియన్లను ఆన్​లైన్ చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ ఫండ్స్​ రావడం లేదని కోఆర్డినేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర్గంపాడు సీహెచ్ సీలో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి తేవాలని ఆసుపత్రుల సమన్వయ అధికారికి సూచించారు. ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రి, రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు స్టీల్​ సైన్​బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోగులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో మరుగుదొడ్లు, రోడ్డు నిర్మాణానికి ప్రపోజల్స్​ పంపించాలని తెలిపారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా చూడాలని ఆదేశించారు. తనిఖీల్లో ఓపీ రిజిస్టర్​ను పరిశీలిస్తానని చెప్పారు. సూపరింటెండెంట్  డాక్టర్  కుమారస్వామి, డీఎంహెచ్​వో డాక్టర్ దయానందస్వామి, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

ఆఫీసర్లను భయపెట్టేందుకే బైక్ కు నిప్పు పెట్టిన్రు

పెనుబల్లి, వెలుగు: ఫారెస్ట్ ఆఫీసర్లను భయపెట్టడానికి వేటగాళ్లు ఫారెస్ట్  డిపార్ట్​మెంట్  బైక్ ను కాల్చి వేశారని, ఈ ఘటనకు పోడుభూములతో సంబంధం లేదని సత్తుపల్లి రూరల్  సీఐ హనూక్  తెలిపారు. మండలంలోని బ్రాహ్మల్లకుంటలో ఈ నెల 2న ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ కు చెందిన బైక్ ను దహనం చేసిన కేసులో శుక్రవారం విఎం బంజరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో మీడియాకు సీఐ వివరాలు వెల్లడించారు. బ్రాహ్మల్లకుంట గ్రామం పక్కనే ఉన్న కనిగిరి అడవుల్లో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడేందుకు ఉచ్చులు పెడతారని చెప్పారు. వేటగాళ్లను హెచ్చరించడంతో పాటు ఉచ్చులను స్వాధీనం చేసుకోవడంతో ఫారెస్ట్ ఆఫీసర్లను భయపెట్టేందుకు ఎఫ్ఎస్​వో కాళీ పార్క్ చేసిన బైక్​ను తాళ్లపెంట గ్రామానికి చెందిన ఏడుగురు, బ్రాహ్మల్లకుంట గ్రామానికి చెందిన ఒకరు వరి గడ్డి వేసి నిప్పు పెట్టి పరారైనట్లు తెలిపారు. కల్లూరు ఏసీపీ వెంకటేశ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ సూరజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

చిరు వ్యాపారులపై దాడి చేసిన వారిని శిక్షించాలి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: యూపీకి చెందిన చిరు వ్యాపారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ డిమాండ్​ చేశారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, టూటౌన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కొంత మంది యువకులు బైక్​లపై తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఇతర ప్రాంతానికి చెందిన వారిపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. కార్పొరేటర్​ డి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాం రాథోడ్, నల్లగట్టు ప్రవీణ్, అల్లిక అంజయ్య, శ్యామ్, కుమలి శ్రీనివాసరావు, నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు.