
మెదక్ జిల్లాలో రోడ్ల మీద ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. అకాల వర్షానికి రోడ్లు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రామాయంపేట మండలంలోని డి-ధర్మారంలో కురిసిన వర్షంతో రోడ్లపై ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. వడ్ల కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయంటున్నారు రైతులు. దీంతో ఎక్కడ పోసిన వడ్లు అక్కడే ఉన్నాయని.. కొనుగోళ్లను సర్కార్ స్పీడప్ చేయాలంటున్నారు రైతులు. లేకపోతే కల్లాల్లోనే మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం.. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు రోడ్డెక్కారు. వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి.. వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ.. రుద్రంగి మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దీంతో రుద్రంగి-కోరుట్ల హైవే పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముస్తాబాద్ మండలం, వెంకట్రావు పల్లె ఐకేపీ సెంటర్లో రైతులు గొడవకు దిగారు. వ్యవసాయశాఖ అధికారుల ఒత్తిడితో వడ్లు కొనగోలు ఆపేశామని సిబ్బంది చెబుతున్నారు. సెంటర్ లో ఉన్న రైతులు నిలదీయడంతో స్థానిక కొనగోలు కేంద్రం ఇంచార్జి రమేష్ సెంటర్ నుండి వెళ్ళిపోయాడు. సరైన మాయిశ్చరైజర్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయలేమన్నారు ముస్తాబాద్ ఐకేపి సెంటర్ల అధికారిణి. దీంతో సెంటర్ నిరసన వ్యక్తం చేశారు రైతులు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లిలో రైతు వేదిక దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. క్వింటాకు 2 కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లులకు వెళ్తే నాలుగు, ఐదు కిలోలు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.