కామారెడ్డిలో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన

కామారెడ్డిలో వడ్లకు నిప్పు పెట్టి రైతుల నిరసన

కామారెడ్డి, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం, తరుగు పేరుతో కోత పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు మరోసారి రోడ్డెక్కారు. క్వింటాల్ వడ్లకు 12 కిలోలు కట్ చేస్తున్నారని మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ వద్ద ఆందోళన చేశారు. కామారెడ్డి-– కరీంనగర్​ హైవేపై వడ్లు పోసి నిప్పు పెట్టడంతో పాటు ముళ్ల కంప వేశారు. అక్కడే కూర్చొని గంట పాటు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామైంది. ఇన్ని రోజులు వడ్లు కాంటా పెట్టలేదని, ఇప్పుడేమో క్వింటాల్ కు 12 కిలోల వరకు కోస్తున్నారని రైతులు మండిపడ్డారు. పురుగు మందు డబ్బాలిస్తే తాగి చచ్చిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. లీడర్లు, ఆఫీసర్లు అందరూ బాగానే ఉన్నారని.. రైతులకు మాత్రమే కష్టాలు వస్తున్నాయని వాపోయారు. సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లను కాంటా పెట్టడానికి నెల నుంచి రెండు నెలలు చేసిన ఆఫీసర్లు... ఇప్పుడు తరుగు పేరుతో మిల్లర్లు భారీగా కోత విధిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ధర్నా విషయం తెలిసి తహసీల్దార్ శ్రీనివాస్ అక్కడికి వచ్చారు. రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. కాగా, ఇదే సమస్యపై కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్​కు చెందిన పలువురు రైతులు ఇన్​చార్జి అడిషనల్ కలెక్టర్ వెంకట మాధవరావుకు వినతి పత్రం అందజేశారు. వడ్లు మిల్లుకు వెళ్లినంక మిల్లర్లు తరుగు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు.