వెల్దుర్తి మండలంలో కొనుగోలు ప్రారంభించాలని రైతుల ఆందోళన

వెల్దుర్తి  మండలంలో కొనుగోలు ప్రారంభించాలని రైతుల ఆందోళన

వెల్దుర్తి,  వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మండలంలోని కుకునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే  కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 20 రోజుల కింద గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ  ఇప్పటికీ ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని పీఏసీఎస్​ చైర్మన్​కు విజ్ఞప్తి చేస్తే బయట అమ్ముకోవాలని చెబుతున్నారని, వైస్ చైర్మన్​ను ప్రశ్నిస్తే ధర్నా చేసుకోండని  నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రైతుల వద్దకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.