వడ్లు కొనడం లేదంటూ..హైవేలపై రైతుల ఆందోళన

వడ్లు కొనడం లేదంటూ..హైవేలపై రైతుల ఆందోళన
  • నల్గొండ జిల్లాలో అన్నదాతల రాస్తారోకోలు
  • ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్​

హాలియా/దేవరకొండ, వెలుగు: ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొనడం లేదంటూ ఆగ్రహించిన అన్నదాతలు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. పది రోజులుగా నల్గొండ, హాలియా, నాగార్జున సాగర్, హైదారాబాద్​ హైవేలపై ఏదో ఒకచోట రాస్తారోకోకు దిగుతున్నారు. ఐకేపీ సెంటర్లలో వడ్లు పోసి 20 రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదని మంగళవారం అనుముల మండలం పులిమామిడి స్టేజీ వద్ద, ఇబ్రహీంపట్నం స్టేజీ వద్ద నల్గొండ, హాలియా ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.

పెద్దవూరలోని పీఏసీఎస్ సెంటర్​లో లారీలు రాకపోవడంతో వడ్ల నిల్వలు పేరుకుపోయాయని సాగర్–హైదరాబాద్ హైవే పై ధర్నాకు దిగారు. వర్షాలతో వడ్లు తడుస్తూ మొలకెత్తుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైవేలపై రైతుల ధర్నాలతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసుల జోక్యం చేసుకొని రైతులకు సర్ధి చెప్పడంతో విరమించారు. అలాగే నల్లగొండ జిల్లా పెద్ద​అడిశర్లపల్లి మండలం రంగారెడ్డిగూడెం వద్ద సాగర్​–హైదరాబాద్​ మెయిన్​రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. సెంటర్​లో ధాన్యం పోసి పడిగాపులు కాస్తున్నా తేమ పేరుతో కాంటా వేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్ఐ రంజిత్​రెడ్డి, అధికారులు వచ్చి రైతుల సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని చెప్పడంతో  విరమించారు.